మలికిపురం: అర్నబ్ అతలాకుతలం చేసింది.. కోనసీమకు చీకటి కష్టాలు తెచ్చింది.. పొలాల్లో నీరు చేరి రైతన్న కష్టాన్ని తుడిచేసింది.. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.. కర్షకులకు ఉపాధి దూరమైంది.. తినడానికి తిండి గింజ లేకపోయింది.. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది.. తుపాను వచ్చి సుమారు 15 రోజులవుతున్నా, బాధితులకు కనీసం సాయం చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అందించే అరకొర బియ్యం, నిత్యావరసరాలకూ బాధితులకు పడిగాపులు మిగుల్చుతోంది.
ప్రజల అవస్థలు
అర్నబ్ తుపాను కారణంగా కోనసీమ జిల్లాలో దాదాపు ప్రతి కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఇళ్లు దెబ్బతినడం, పంటలు నాశనం కావడంతో పాటు గత 15 రోజులుగా గ్రామాల్లో ముంపు సమస్య వేధించింది. పేదలు కనీసం పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. పొలం పనులు లేక కూలీలు, వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు అందిస్తామని ప్రభుత్వం చాలా రోజుల కిందట ప్రకటించింది. దీనిలో భాగంగా బుధవారం రాజోలు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో బియ్యం, నిత్యావసరాలు పంపిణీని ప్రారంభించారు. ఇదంతా ప్రచారానికే అన్నట్లు సాగింది. చెప్పింది ఒకటి.. ఇస్తుందొకటి అన్నట్టు తయారైంది.
మలికిపురం మండలంలో 21 గ్రామాలకు గాను కేవలం ఆరు గ్రామాలకు మాత్రమే మంజూరు చేశారు. గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లిపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి గ్రామాల్లో పంపిణీని చేపట్టినా పూర్తిస్థాయిలో సరకులు రాక బాధితులు క్యూ ఉండి, ఇబ్బంది ఇడ్డారు. తూర్పుపాలెంలో బాధితులకు సరకులు అందక గలాటా చోటుచేసుకుంది. కొందరికే డీలర్ ఇస్తున్నారంటూ నిలదీశారు. దీంతో గందరగోళం చోటుచేసుకుంది. ఇక రాజోలు మండలంలో ప్రతి తెల్ల కార్డుదారునికి 10 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారు. సఖినేటిపల్లి మండలంలో ఇంకా ఆ ఊసేలేదు. అసలు సాయం ఎంత మందికి ఇస్తారనేది అధికారులు కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి నిరసన ఎదురవుతోంది.
తూర్పుపాలెం పంపిణీ కేంద్రం వద్ద తుపాను బాధితుల క్యూ
అందరికీ సాయం అందక మలికిపురం మండలం తూర్పుపాలెంలో గలాటా
అరకొర సాయమే..
ప్రతి తెల్లకార్డు దారునికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పామాయిల్ ఇస్తామని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పి పంపిణీని ప్రారంభించారు. అయితే ఇవి కూడా పూర్తి స్థాయిలో గ్రామాలకు చేరలేదు. దీంతో ఆయా పంపిణీ డిపోల వద్ద గలాటా చోటుచేసుకుంది. ఆయా గ్రామాల పెద్దలు జోక్యం చేసుకుని అధికారులను నిలదీయడంతో ఇంకా సరుకులు వస్తాయని, కంగారు పడొద్దని ప్రజలను సముదాయిస్తున్నారు.
తుపాను బాధితులకు మొండిచేయి
తూర్పుపాలెం వద్ద పంపిణీలో గలాటా
మలికిపురం మండలంలో
ఆరు గ్రామాలకే బియ్యం, నిత్యావసరాలు
అదీ సగం మందికి చేరని వైనం
రాజోలు, సఖినేటిపల్లి
మండలాల్లోనూ అంతే!


