రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఐదు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే యూనివర్సిటీ అభివృద్ధిని మాత్రం విస్మరిస్తోందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలసందర్భంగా కనీసం రూ.1,000 కోట్లు కేటాయించాలన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలకు విలువైన భూములు కేటాయిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఎన్ని? వాటికి ఎంత భూమి కేటాయించారు? వాస్తవంగా ఎంత పెట్టుబడి పెట్టాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాయి? అనే వివరాలను ప్రజల ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మరణం కేసుపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ఫ సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం
ఫ మాజీ ఎంపీ హర్షకుమార్


