కార్తికం.. దేదీప్యం | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. దేదీప్యం

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

ఫ ఈ నెల 10 నుంచి కార్తిక మాసం ప్రారంభం

ఫ హరిహరులకు ప్రీతికరం

ఫ భక్తుల పుణ్యస్నానాలతో రేవుల్లో సందడి

ఫ కన్నుల పండువగా దీపారాధనలు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. అన్ని ఆలయాలు, నదీ తీరాలు, ఇళ్లల్లో దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తిక పురాణం చెబుతోంది. దీప దర్శనం, దీప దానం, దీప ప్రకాశనం అనే మూడు అంశాలు ఈ మాసంలో ఎంతో పుణ్యాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఒక్క మనుషులే కాకుండా పశుపక్షాదులు, క్రిమికీటకాలు, సమస్త జీవరాశీ ఈ మాసంలో దీపదర్శనంతో తరిస్తాయని నానుడి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, విప్ప నూనె వంటి వాటితో కూడా దీపారాధనలు చేస్తారు. అలాగే నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు కూడా ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఆలయాల విశిష్టత

● రాజమహేంద్రవరంలోని పవిత్ర గోదావరి తీరం మంగళవారం నుంచి శివనామ స్మరణతో మార్మోగనుంది. మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించిన శివ లింగాన్ని గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయంలో చూడవచ్చు.

● భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం గోదావరి తీరాన కోటిలింగాల పేటలో ఉంది. ఇది అతి ప్రాచీనమైన, పురాతన ఆలయం. బ్రహ్మదేవుడే విప్రుని వేషంలో వచ్చి ఇక్కడ కోటిలింగాలు ప్రతిష్ఠించాడని, అందులో ఒక లింగం మాయం కావడంతో మహర్షులు కాశీ క్షేత్రం నుంచి ఒక లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారని తెలుస్తోంది. అదే ప్రస్తుతం ఆలయంలో పూజలందుకుంటున్న కోటిలింగేశ్వరస్వామి లింగమని చెబుతారు. కోటిలింగాల క్షేత్రానికి అభినవ విరూపాక్ష పీఠమనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది.

● గాడాలలోని మహాలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామివారి పీఠంలో కార్తిక మాసం సందర్భంగా రుద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారికి 1.20 వేల రుద్రాక్షలతో అర్చన చేస్తారు.

● కార్తిక మాసంలో సోమవారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. పరమ శివునికి ప్రీతికరమైన రోజు అందులో కార్తిక మాసంలో వచ్చే సోమవారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ ఏడాది కార్తిక సోమవారాలు నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 7వ తేదీల్లో రానున్నాయి.

ప్రతి రోజూ పుణ్యదినమే

కార్తిక మాసంలో ప్రతి రోజూ పుణ్యదినమే. ప్రతి రోజూ నదీ స్నానం చేసి దీప దర్శనం చేసుకోవడం వల్ల పాపభీతి తొలగి, ఆ హరిహరుల కృపకు పాత్రులవుతాం. అంతే కాకుండా ఈ మాసంలో పుణ్యదానాలు చేయడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్ల జ్ఞానం లభిస్తుంది.

– చిన్న వెంకన్న బాబు,

మహాలక్ష్మి సమేత

వేంకటేశ్వరస్వామి పీఠాధిపతి

శివకేశవులకు ప్రీతికరం

కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఇటు శివుని పరంగా కార్తిక సోమవారాలు, నాగుల చవితి వంటి పర్వదినాలు, అటు విష్ణువు పరంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. వన సమారాధనల్లో ఉసిరి చెట్టు నీడన సాలగ్రామ పూజలు చేయడం, కార్తిక దామోదర ప్రీత్యర్థం పూజలు చేయడం వల్ల శివకేశవులిద్దరినీ ఈ మాసంలో పూజించడం సంప్రదాయం. – పెద్దింటి నీలకంఠశర్మ, ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు

ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవాలయం

(ఫైల్‌)

కార్తిక మాసంలో పండగలు ఇవే..

కార్తిక మాసంలో నవంబర్‌ 13న నాగుల చవితి, 20న శుద్ధ ఏకాదశి, 21న క్షీరాబ్ధి ద్వాదశి, 24న జ్వాలా తోరణం, డిసెంబర్‌ 9న పోలి స్వర్గం, డిసెంబర్‌ 15న సుబ్రహ్మణ్యేశ్మర షష్టి పండగలు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement