బారులు తీరి.. ఈలలు వేసి.. | - | Sakshi
Sakshi News home page

బారులు తీరి.. ఈలలు వేసి..

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

ఫ రాజకీయ పార్టీల కార్యకర్తల సంబరాలు

ఫ ‘నన్నయ’ వద్ద ఉత్కంఠ వాతావరణం

ఫ హైవేపై గుంపులుగా చేరి సందడి

రాజానగరం: జిల్లాలోని 12 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదికవి నన్న యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 6.30 గంటల వరకు కొనసాగింది. దీంతో ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉత్సుకతతో 12 మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిలో పాస్‌లు ఉన్న వారిని యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించారు. దీంతో మిగిలిన వారంతా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గుంపులు గుంపులుగా వేచి ఉన్నారు. రౌండ్ల వారీగా జరిగిన ఓట్ల లెక్కింపుకు సంబంధించిన సమాచారం తెలుసుకుని, తదనుగుణంగా కేరింతలు కొడుతూ రహదారి అంతటా విస్తరించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తమ ప్రతాపాన్ని చూపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఓట్ల లెక్కింపు తుది దశలకు చేరుకునే సమయంలో చాలామంది కార్యకర్తలు యూనివర్సిటీలో లెక్కింపు జరిగే ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ కూడా రద్దీ ఏర్పడింది.

మీడియా ప్రతినిధుల పడిగాపులు

ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతానికి మీడియాను కూడా అనుమతించలేదు. అయితే ఆ ప్రాంతానికి చేరువగా కాకుండా సుదూరంగా ఒక టెంట్‌ వేసి, దానికి ఎలక్ట్రానిక్‌ అండ్‌ ప్రింట్‌ మీడియా అంటూ బోర్డు తగిలించి, చేతులు దులిపేసుకున్నారు. నిన్నటి వరకు ఓట్ల లెక్కింపుకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి గంటకు ప్రకటిస్తామని, మీడియా పాయింట్‌లో డిస్‌ప్లే చేస్తామని జిల్లా ఉన్నతాధికారులు సైతం తెలిపారు. అయితే ఈ రోజు ఆ విధమైన సదుపాయాలు ఎక్కడా కానలేదు సరి కదా, మీడియా పాయింట్‌ వద్ద కూడా కూర్చునేందుకు వీలు లేకుండా ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల అనుయాయులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశారు. దీంతో లెక్కింపు కేంద్రం సమీపంలోకి వెళ్లి డివైడర్‌పై కూర్చుని, బయటకు వచ్చే వారిని నుంచి లెక్కింపు ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు ‘ మీడియా అయినా సరే, ఇక్కడ ఉండటానికి వీలు లేదు, వెళ్లిపోండి’ అంటూ దురుసుగా పంపించి వేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వాతావరణం ఏ ఎన్నికలలోనూ చూడలేదంటూ సీనియర్‌ పాత్రికేయులు సైతం ఆవేదన వ్యక్తం చేసి, అక్కడ నుంచి బయటకు వచ్చేశారు.

ఫలితాలను ఎందుకు ప్రకటించలేదు

ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి రౌండ్‌కి అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలను, మెజార్టీని మైకు ద్వారా బయట వారికి తెలిసేలా అనౌస్‌మెంట్‌ (ప్రకటన) చేయాల్సి ఉంది. అలాగే బయట బోర్డులో డిస్‌ ప్లే చేయాలి. ఇక్కడ అవేమీ జరుగలేదు. గెలుపొందిన అభ్యర్థులుగానీ, వారి సంబంధీకులుగానీ బయటకు వెళ్లిపోతూ చెబితేనే ఫలితాల వివరాలు తెలిసే పరిస్థితి ఈసారి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement