కొత్తపేట: ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల తరఫున తండ్రి, తనయ విజయం సాధించారు. కొత్తపేట మండల పరిధి పలివెల శివారు పూజారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు పొనుగుపాటి సత్యనారాయణ తన కుమార్తె చాందినీకి కొత్తపేటలో టీడీపీ కుటుంబానికి చెందిన బూసి చరణ్‌తో వివాహం చేశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యనారాయణ పలివెల – 2 ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కుమార్తె చాందిని కొత్తపేట – 2 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచారు. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. మండల పరిషత్‌లో తండ్రీ తనయలు అధికార, ప్రతిపక్ష సభ్యులుగా వ్యవహరించనున్నారు.
క్షేత్రపాలకుని ఆలయానికి కార్తిక శోభ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి ఉపాలయమైన భ్రమరాంబా సమేత క్షేత్రపాలకుని ఆలయం కార్తిక మాసోత్సవాలు ముస్తాబవుతోంది. ఈ నెల 10 నుంచి డిసెంబర్ 8 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం ఆకాశ దీపోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభం కాను న్నాయి. 16, 23, 30 తేదీల్లో కార్తిక సోమవారా లను పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం ఆకాశ దీపం, గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. 24న కార్తిక పౌర్ణమి సందర్భంగా అభిషేకాలు, ఆకాశ దీపం, జ్వాలాతోరణం, గ్రామోత్సవం జరగనున్నాయి. 27న ఆ రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకాలు, స్వామివారి కల్యాణం, సాయంత్రం ఆకాశదీపం నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆకాశ దీపంతో పాటు ప్రభోత్సవం జరగనుంది. డిసెంబర్ 7న ఉదయం 9 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తారు. ఆరోజు సాధారణ అభిషేకాలు, రుద్రహోమం, గ్రామోత్సవాలు ఉండవని ఈఓ తెలిపారు. డిసెంబర్ 8తో ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
చిన్న అన్నవరంలో..
రెండో అన్నవరం (చిన్న అన్నవరం)గా ప్రసిద్ధి చెందిన లింగపాలెం మండలం రంగాపురంలోని భూనీళా సమేత సత్యనారాయణస్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ క్షేత్రంలో ప్రతి రోజూ సత్యనారాయణస్వామివారి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.


