సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ పాలకులు ఎవరో కొద్ది సేపటిలో తేలిపోనుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్ తొలి పాలకవర్గంలో ఎవరు భాగస్వాములవుతారో, ఎంపీటీసీలుగా ఎవరు ఎన్నిక కానున్నారో ఇప్పటికే ఓటర్లు అభిప్రాయం ఓటు ద్వారా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఆ ఓట్ల కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో 21 స్ట్రాంగ్ రూమ్‌లు, 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 71 కౌంటింగ్ హాళ్లు, 824 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. లెక్కింపులో 907 మంది పాల్గొనగా, 1,730 మంది వారికి సహాయపడుతున్నారు.
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అలాగే 412 ఎంపీటీసీ స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 405 స్థానాలకు 901 మంది పోటీలో నిలిచారు. గోపాలపురం మండలంలో ఎన్నిక వాయిదా వేయడంతో 20 జెడ్పీటీసీలు, 389 ఎంపీటీసీలకు గురువారం పోలింగ్ నిర్వహించారు. గోపాలపురం జెడ్పీటీసీ, ఆ మండలంలోని 16 ఎంపీటీసీలకు శుక్రవారం ఓటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12,02,638 ఓటర్లు ఉండగా మొత్తం 8,61,653 మంది తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లోకి చేర్చారు. విజేతలు ఎవరన్నది శనివారం సాయంత్రానికి తేలనుంది.
మూడు ప్రాంతాల్లో కౌంటింగ్
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండపేట, రాయవరం, రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, సీతానగరం, కోరుకొండ, రాజానగరం, గోకవరం, కపిలేశ్వరపురం మండలాల కౌంటింగ్ రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఇక్కడి ఇంజినీరింగ్, సైన్స్ బ్లాక్‌లలో కౌంటింగ్‌కు ప్రత్యేక గదులు కేటాయించారు. 12 మండలాల ఎంపీటీసీలకు 233, జెడ్పీటీసీలకు 233 కలిపి మొత్తం 466 టేబుళ్లు ఏర్పాట్లు చేశారు.
● కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాలకు సంబంధించి నిడదవోలులోని ఎస్‌వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ ఆరు మండలాలకు సంబంధించి ఎంపీటీసీలకు 125, జెడ్పీటీసీలకు 125 కలిపి మొత్తం 250 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
● తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాలకు కొవ్వూరులోని దీప్తి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల్లోనే ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి, కౌంటింగ్‌కు అవసరమైన గదులు ఏర్పాటు చేసి ఎంపీటీసీలకు 54, జెడ్పీటీసీలకు 54 కలిపి మొత్తం 108 టేబుళ్లు సిద్ధం చేశారు.
కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు
కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు ఇలా..
మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ
అనపర్తి 20 20
బిక్కవోలు 20 20
గోకవరం 20 20
కడియం 22 22
కపిలేశ్వరపురం 19 19
కోరుకొండ 23 23
మండపేట 22 22
రాజమండ్రి రూరల్ 4 4
రాజానగరం 28 28
రంగంపేట 16 16
రాయవరం 19 19
సీతానగరం 20 20
చాగల్లు 19 19
కొవ్వూరు 20 20
తాళ్లపూడి 15 15
గోపాలపురం 18 18
నల్లజర్ల 23 23
నిడదవోలు 20 20
పెరవలి 20 20
ఉండ్రాజవరం 22 22
దేవరపల్లి 22 22
మొత్తం 412 412
నేటి ఉదయం 8 గంటల నుంచి
ఓట్ల లెక్కింపు
రాజానగరం, నిడదవోలు,
కొవ్వూరుల్లో ఏర్పాట్లు
మూడు చోట్లా 21 చొప్పున
స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు
71 కౌంటింగ్ హాళ్లలో
824 టేబుళ్ల ఏర్పాటు
ముందుగా ఎంపీటీసీలు..
తర్వాత జెడ్పీటీసీల ఫలితాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ శుక్రవారం తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద ఫ్రిస్కింగ్, గుర్తింపు కార్డుల తనిఖీలు చేపట్టడంతో పాటు నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనుమతి ఉన్నవారు, కౌంటింగ్ ఏజెంట్లు తమ గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలన్నారు.
మూడు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాజానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు లేనప్పటికీ కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పోలీసుల సూచనలు పాటించాలన్నారు. కొవ్వూరు మండలం వేములూరులోని దీప్తి ఇంగ్లిష్ మీడియం పాఠశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కొవ్వూరు నుంచి పసివేదల, వేములూరు, తోగుమ్మి వెళ్లే వాహనాలు ఔరంగాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.
నిడదవోలులోని ఎస్‌వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కళాశాలకు వెళ్లే రహదారుల్లో సాధారణ ప్రజలు, వాహనాలకు అనుమతి ఉండదని, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుందన్నారు.
నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు
బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడరాదన్నారు. అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు.
సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా
ఎన్నికల ఫలితాలకు సంబంధించి అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, షేర్ చేస్తే సంబంధిత వ్యక్తులతో పాటు గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తప్పవన్నారు.


