దేవరపల్లి: గోపాలపురం మండలంలోని స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. గురువారం జరగాల్సిన పోలింగ్, భారీ వర్షాల వల్ల శుక్రవారం నిర్వహించారు. మండలంలో 64 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 51,211 మంది ఓటర్లకు గాను 37,981 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఆర్వో పి.భాగ్యవతి తెలిపారు. చిట్యాల పోలింగ్ కేంద్రంలో జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముచ్చికర్ల వరలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం బురదతో అధ్వానంగా ఉండడంతో సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడ్డారు. జగన్నాథపురం జెడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎం.గౌతమి సందర్శించారు. జెడ్పీటీసీ అభ్యర్థి వరలక్ష్మి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. విజయావకాశాలపై అభ్యర్థులు, నాయకులు ధీమాతో ఉన్నారు.
4,300 ఎకరాల్లో
దెబ్బతిన్న పొగాకు
బోర్డు రీజనల్ మేనేజరు సురేంద్రకుమార్
దేవరపల్లి: మురసు తుపాను ప్రభావంతో టుబాకో రీజియన్ పరిధిలో 4,300 ఎకరాల్లో పొగాకు తోటలు దెబ్బ తిన్నట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక వేలం కేంద్రం పరిధిలోని చిన్నాయగూడెం, సంగాయగూడెం గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. రీజియన్ పరిధిలో 6,400 ఎకరాల్లో పొగాకు నాట్లు వేశారని, వాటిలో దెబ్బతిన్న సుమారు 4,300 ఎకరాల్లోని తోటలు పనిచేయవని తెలిపారు. గ్రామంలో తడిసిన సుమారు 600 పొగాకు బేళ్లను వేలం కేంద్రంలో త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు వివరించారు. వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎకరాకు రూ.లక్ష నష్టం వస్తుందని తెలిపారు. నారుమడులకు విత్తనాలు సరఫరా చేయాలని, బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని, నష్టపోయిన తోటలకు పరిహారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, క్షేత్రస్థాయి అధికారి వినోధ్ కుమార్, బోర్డు మాజీ వైస్ ఛైర్మన్ కె. వాసుదేవరరావు, రైతులు పాల్గొన్నారు.
వలలో చిక్కుకున్న
కింగ్ కోబ్రా
గంగవరం: రైతు పొలంలో ఏర్పాటు చేసిన వలలో అరుదైన, విషపూరితమైన కింగ్ కోబ్రా చిక్కుకుంది. దీనిని అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. మొల్లేరు గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద రైతు జగదీష్‌కు చెందిన పొలంలో కోతుల నివారణ కోసం ఏర్పాటు చేసిన వలలో కింగ్ కోబ్రా చిక్కింది. గమనించిన రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఫోక్స్‌పేట అటవీ రేంజ్ అధికారి పి.శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ ఈశ్వర్ సహాయంతో వలలో చిక్కుకున్న కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పామును పరిశీలించి ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్న అనంతరం దానిని అడ్డతీగల రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టినట్టు శ్రీనివాస్ తెలిపారు.


