కూటమిలో అందరూ చైర్‌పర్సన్ అభ్యర్థులే?
పరిషత్ పోరులో ప్రచార పర్వానికి మంగళవారంతో తెరపడనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే ఆటోలు, ఇతర వాహనాలపై మైక్ ప్రచారాలు జోరుగా సాగాయి. చివరి రోజు మరింతగా ముమ్మరంగా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ పోరులో కీలకమైన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్ తొలి ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 405 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు.జిల్లా వ్యాప్తంగా 1,476 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 499 సున్నిత, 239 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 738 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సిద్ధం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేశారు. పోలింగ్ విధుల నిర్వహణకు 1,771 మంది రిటర్నింగ్ అధికారులు, 8,856 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 84 మంది ప్రిసైడింగ్ అధికారులు, 245 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు 496 మంది జోనల్ అధికారులు, 270 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు మొత్తం 496 వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 21 పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బందికి అందజేయనున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు, ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రతకు సంబంధించి పోలీసు శాఖ ఆధ్వర్యంలో 1,876 మందితో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 1321 కానిస్టేబుళ్లు, 438 మంది ఇతర సిబ్బందిని విధులకు కేటాయించి పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
కూటమిలో టెన్షన్
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం, క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడంతో పోటీదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయి ఓడిపోతామేమోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. అందువల్లే ప్రచారం తర్వాత ఎన్నికల రోజు వరకు మిగిలిన 36 గంటలూ నోట్ల వర్షం కురిపించేందుకు, మద్యం పంపిణీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే డబ్బు, మద్యం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యంగా తొలి జెడ్పీని జనరల్ మహిళకు కేటాయించడంతో కూటమిలో చాలా మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంపేట, సీతానగరం, దేవరపల్లితోపాటు మిగిలిన మండలాల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది.
ఎన్నికల వివరాలు
జెడ్పీటీసీ స్థానాలు 21 పోటీలో ఉన్న అభ్యర్థులు 73 మంది ఎంపీటీసీ స్థానాలు 405 ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాలు 7 పోటీలో ఉన్న అభ్యర్థులు 901మందిపోలింగ్ కేంద్రాలు 1,476
పరిషత్ పోరులో కీలకమైన ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ చైర్ పర్సన్ అభ్యర్థి ఎవరన్నది కూటమి పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీలకు 13 చోట్ల టీడీపీ, 7 చోట్ల జనసేన, ఒక స్థానంలో బీజేపీ పోటీ చేస్తున్నాయి. అయితే తమకే జెడ్పీ చైర్‌పర్సన్ స్థానమని ముందుగా టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేసుకున్నారు. అయితే ప్రజావ్యతిరేకతకు తోడు కూటమిలోని కుమ్ములాటలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడ్డారు. దానిలో భాగంగానే ఎన్నికలయ్యాకే చైర్మన్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించేశారు. దీంతో ఎవరికి వారే తమకే అవకాశం దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు.
జనసేన నుంచి చైర్‌పర్సన్ స్థానం ఆశించిన గంటా స్వరూపదేవి నామినేషన్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసింది. ఇక ఆ పార్టీ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి సీతానగరం జెడ్పీటీసీకి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా ఆశలపల్లకీలో ఉన్నారు.
టీడీపీ నుంచి రంగంపేట జెడ్పీటీసీకి పోటీ చేస్తున్న ఆళ్ల శిరీష ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అలాగే దేవరపల్లి నుంచి పోటీ చేస్తున్న అండ్రు రాధిక కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తేలకముందే చైర్‌పర్సన్ స్థానం కోసం కూటమిలో వెన్నుపోట్లు భయపెడుతున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో ప్రజావ్యతిరేకత దడ పుట్టిస్తోంది.
చివరి రోజు మరింత
హోరెత్తనున్న మైకులు
జిల్లాలో 21 జెడ్పీటీసీ, 405 ఎంపీటీసీ స్థానాలకు 5న ఎన్నికలు
ప్రలోభ పర్వానికి తెరతీయనున్న కూటమి!
భారీగా మద్యం, డబ్బులు సిద్ధం
మరో వైపు చైర్‌పర్సన్ అభ్యర్థి లేకుండా కూటమి పోటీ


