సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోటీ చేసిన 226 మంది అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం నిడదవోలు, మండపేట, కొవ్వూరులో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఆదివారం ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో స్ట్రాంగ్ రూమ్‌లలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వార్డుల వారీగా 132 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసి చైర్మన్, కౌన్సిలర్ ఓట్లను సమాంతరంగా లెక్కించనున్నారు. రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.
● మండపేట మున్సిపాలిటీలోని 36 వార్డులకు 72 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 240 మంది సిబ్బందిని కేటాయించారు. స్థానిక అన్నపూర్ణ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో కౌంటింగ్ చేపట్టనున్నారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపుతో పాటు చైర్మన్, కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేశారు.
● కొవ్వూరు మున్సిపాలిటీలో 28 వార్డులకు 28 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. వేములూరు రోడ్డులోని దీప్తి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో కౌంటింగ్ చేపట్టనున్నారు. టేబుల్‌కు ముగ్గురు చొప్పున 84 మంది సిబ్బందిని కేటాయించారు.
● నిడదవోలు మున్సిపాలిటీలో 32 వార్డులకు 32 కౌంటింగ్ టేబుళ్లు సిద్ధం చేశారు. ఎస్‌వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని లైబ్రరీ కామర్స్ బ్లాక్‌లో ఏర్పాట్లు చేశారు.
భద్రతా ఏర్పాట్లు
కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల పర్యవేక్షణ, కౌంటింగ్ సిబ్బంది విధుల కేటాయింపు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిబంధనల ప్రకారం ప్రవేశం, బారికేడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలు చేపడుతున్నారు. మండపేటలో 49,059 మంది ఓటర్లకు 38,040 మంది (77.54 శాతం), కొవ్వూరులో 34,452 మంది ఓటర్లకు 23,574 మంది (68.42 శాతం), నిడదవోలులో 35,086 మంది ఓటర్లకు 24,315 మంది (69.30 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పటిష్ట బందోబస్తు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): కొవ్వూరు, మండపేట, నిడదవోలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఆ మూడు ప్రాంతాల్లో సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, గుర్తింపు కార్డుల తనిఖీలు, నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని, అనుమతి లేని వస్తువులు, మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించామని తెలిపారు.
నేడే ఓట్ల లెక్కింపు
మూడు మున్సిపాలిటీల్లో
132 కౌంటింగ్ టేబుళ్లు
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
ముందు కౌన్సిలర్లు,
తర్వాత చైర్మన్ ఫలితాలు
పది గంటలకు తొలి రౌండ్ ఫలితం వెల్లడి


