● టీడీపీ గోపాలపురం ఎమ్మెల్యే
మద్దిపాటి వ్యాఖ్యల కలకలం
● చీకటి దెబ్బ తీయొద్దంటూ హెచ్చరిక
ద్వారకాతిరుమల: ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయాల్సిన ఎమ్మెల్యే.. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం నేతలను తోడేళ్లు, గుంటనక్కలతో పోలుస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ‘వెన్నుపోటు పొడవొద్దు.. దొంగదెబ్బలు, చీకటి దెబ్బలు తీయొద్దు’ అంటూ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా.. ‘ప్రేమించడం వచ్చు.. అవసరమైతే రెండోది కూడా వచ్చు’ అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం రాత్రి తిమ్మాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలోని అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. ఒకే ఇంట్లో అన్నదమ్ముల మధ్య, తండ్రీకొడుకుల మధ్య భేదాభిప్రాయాలు సహజమని చెబుతూనే.. తిమ్మాపురంలో కొన్ని తోడేళ్లు ఉన్నాయంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. చిన్నచిన్న భావజాల భేదాలు ఉన్నంత మాత్రాన ఎవరూ వెన్నుపోటు పొడవొద్దని, తోడేళ్లు, గుంటనక్కల ఆలోచనల వైపు వెళ్లకుండా రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి రుణం తీర్చుకోవాలని హితవు పలికారు.
ఇప్పటికే క్లీన్ స్వీప్ చేయాల్సింది..
ఎంపీపీ అభ్యర్థిని తిమ్మాపురం గ్రామానికి చెందిన మహిళ కావడంతో ‘నిజానికి ఈపాటికే మీరు మీ ఊరును క్లీన్ స్వీప్ చేసేసి ఉండాల్సింది’ అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అభ్యర్థి గెలుపు కోసం గుండుగొలనుకుంట, వెంకటకృష్ణాపురం గ్రామాల్లోని బంధువులు, సన్నిహితులతో మాట్లాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
ఓ వర్గం నేతలను బహిరంగంగా తోడేళ్లు, గుంటనక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు టీడీపీలోని విభేదాలను మరింత బహిర్గతం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వేదికగా ఎమ్మెల్యే చేసిన ఈ హెచ్చరికలు టీడీపీ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసినా తమకు తగిన గుర్తింపు, ఫలితం ఉండదని ప్రత్యర్థి వర్గం నేతల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.


