కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన గారా రవితేజ అలియాస్ గ్యాంగ్‌స్టర్ తేజ (31)పై పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు అమలు చేశారు. ఆ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం సోమవారం తెలిపింది. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవితేజ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలతో పాటు పలు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు త్రీటౌన్ లాఅండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ వి.అప్పారావు రూపొందించిన సమగ్ర నివేదికను ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రభుత్వానికి పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం రవితేజపై పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న రవితేజకు అధికారులు ఆ ఉత్తర్వులలను అందజేసి అమలు చేశారు.


