● 5 రోజులుగా సరఫరా లేకపోవడంతో
స్థానికుల ఆగ్రహం
● రాస్తారోకో, సబ్ స్టేషన్ వద్ద ధర్నా
అమలాపురం రూరల్: కామనగరువులో విద్యుత్ మంటలు రగిలాయి. అర్నబ్ తుపాను తీరం విధ్వంసం జరిగి ఐదు రోజులైనా తమ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేయని ప్రభుత్వ అసమర్థతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లిలో ఆదివారం రాత్రి రాస్తారోకో, సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. కామనగరువులోని చల్లపల్లి రోడ్డులోని సామిల్లు ప్రాంతానికి కరెంటు ఇవ్వకుండా పొరుగు ప్రాంతానికి ఇచ్చారని, దీనిపై అడిగితే ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయని ఏఈ చెబుతున్నారని తెలిపారు. పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించి, కొంతవరకూ మాత్రమే విద్యుత్ సరఫరా చేశారని, బడుగువారిపేటకు మాత్రం ఇంతవరకూ కరెంటు ఇవ్వలేదని మండిపడ్డారు. కామనగరువు గ్రామ పరిధి గణేష్ నగర్‌కు కరెంటు సరఫరా చేసి, పక్కనే ఉన్న ప్రతాప్ నగర్‌కు ఇవ్వలేదంటూ స్థానిక లైన్‌మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఇప్పటికే 1912 నంబర్‌కు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. తమ ప్రాంతానికి వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ డీఈఈ రాంబాబుకు నేరుగా ఫిర్యాదు చేశారు. కాగా, ఐదు రోజులుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంపై స్థానిక జీఎస్సార్ లే అవుట్‌కు చెందిన మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళన నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అగచాట్లూ పడుతున్నారు.
పేరూరులో...
సబ్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పేరూరు గాంధీనగర్కు ఇంతవరకు విద్యుత్ సరఫరా ఇవ్వలేదని, అడుగుతుంటే అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారంటూ మహిళలు మండిపడ్డారు. విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ పేరూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేశారు. ఆరు రోజులుగా కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నామని వారు నిరసన తెలిపారు.


