రాజమహేంద్రవరం రూరల్: లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో చోరీ చేయడానికి శుక్రవారం రాత్రి ఒక గుర్తు తెలియని అగంతకుడు ప్రయత్నం చేశాడు. స్థానిక పెద్దలు అతడిని అక్కడే బంధించి బొమ్మూరు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ముఖానికి గుడ్డ, భుజానికి బ్యాగు తగిలించుకున్న ఒక యువకుడు ఆలయానికి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న ఇనుక రాడ్డు, ఇతర పరికరాలతో తలుపులు పగుల కొట్టేందుకు చాలా సేపు ప్రయత్నించాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే వల్లీ సేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, స్థానిక పెద్దలకు ఫోన్‌లో తెలిపారు. వారంతా హుటాహుటీన అక్కడికి చేరుకుని, దొంగను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. బొమ్మూరు పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.


