లో
శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
అర్నబ్ తుపాను రూపంలో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాలు రైతుల ఆశలను నీటిపాలు చేశాయి. ఇప్పటి వరకూ తీవ్ర ఎండలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంటను కాపాడుకున్న రైతులను కోతల వేళ ఎదురైన ఈ విపత్తు కోలుకోలేని దెబ్బ తీసింది. కళ్ల ముందే నేలవాలిన పంటను చూసి అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు చేతికందని పంట, ఇంకో వైపు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందన్న భరోసా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం/తాళ్లపూడి/సీతానగరం: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 92 వేల హెక్టార్లలో వరిని సాగు చేశారు. తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులను తట్టుకుని వేల రూపాయలు అప్పు చేసి పెట్టుబడిగా పెట్టి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తుపాను ధాటికి జిల్లాలో సుమారు 50 వేల హెక్టార్లలో వరి పంట నేలకొరిగి నీట మునిగింది. చేతికొచ్చే వేళ పంట నీటి పాలైంది. సీతానగరం, కోరుకొండ, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు, పెరవలి, నిడదవోలు, దేవరపల్లి, కడియం తదితర ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం నుంచి వీచిన భారీ ఈదురు గాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నేలకొరిగాయి. అనంతరం కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో వరి పనలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంట పూర్తిగా నేలకు అంటుకుపోగా, మరి కొన్ని ప్రాంతాల్లో నీటిలో నానుతూ కనిపిస్తోంది.
నాణ్యత పడిపోతే నష్టమే!
నేలకొరిగిన పంట నీటిలో ఎక్కువసేపు ఉంటే ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉంది. గింజల రంగు మారడంతో పాటు నాణ్యత తగ్గే అవకాశం ఉంది. దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే మద్దతు ధర లభిస్తుందా?, తేమ, రంగు మార్పుల పేరుతో కొనుగోళ్లలో కోతలు విధిస్తారా? అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసిన అన్నదాతలకు పంట దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యం నాణ్యత దెబ్బతింటే మరింత నష్టం తప్పదు. చేతికొచ్చిన పంటను కాపాడుకోవాలన్నా, నేలకొరిగిన వరిని ఏరి, ఆరబెట్టి, సురక్షితంగా నిల్వ చేసేందుకు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పులు తీరే వేళ.. అంతులేని వేదన
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతులకు కష్టాలు తప్పలేదు. ఎండలు, నీటి సమస్యలు, ఇతర ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ పంటను కాపాడుకున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చుల కోసం వేల రూపాయలు అప్పులు చేశారు. పంట చేతికొచ్చి ధాన్యం అమ్మితే అప్పులు తీర్చి, కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించారు. తీరా పంట కోతకు సిద్ధమైన సమయంలో తుపాను రూపంలో ప్రకృతి విరుచుకుపడటంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.
పరిహారంపై నమ్మకం సన్నగిల్లి..
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న ఆశ రైతులకు ఉండాలి. అయితే గతంలో మోంథా తుపాను సమయంలో, గత నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం కనీస సాయం అందించలేదని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నష్టాలకే పరిహారం అందని పరిస్థితుల్లో ఇప్పుడు అర్నబ్ తుపాను కారణంగా జరిగిన నష్టానికి చంద్రబాబు కూటమి సర్కార్ ఎలా స్పందిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కష్టమంతా వర్షార్పణం
జిల్లాలో 92 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తే 49,915 హెక్టార్లలోని పంట నేలవాలి నీటిపాలైంది. మరోవైపు మినుములు 810 హెక్టార్లలో, అరటి 6,500 హెక్టార్లలో, ఇతర పంటలు 30 హెక్టార్లలో, ఉద్యానవన పంటలు 1,500 హెక్టార్లలో నీట మునిగాయి. మొత్తంగా జిల్లాలోని 80 వేల మందికిపైగా రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది.
120 రోజుల కష్టం ఒక్క రాత్రిలో...
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. వేసవిని తలపించేలా ఎండలు మండిపోయినా పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా. పంట చేతికొచ్చేసింది..కౌలు చెల్లించేసి, పెట్టుబడి తీయగా ఎంతో కొంత మిగులుతుందనుకున్నా. తీరా ఒక్క రాత్రిలో ప్రకృతి మొత్తం మార్చేసింది. నా 120 రోజుల కష్టం నీటిపాలైంది. ఇప్పుడు ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి.
– కొప్పిశెట్టి నాగభూషణం,
కౌలు రైతు, కొండగుంటూరు
తక్షణమే పరిహారం చెల్లించాలి
8 ఎకరాలు కౌలుకి తీసుకుని స్వర్ణ రకం వరి సాగుచేశాను. కుటుంబం మొత్తం కష్టపడడంతోపాటు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొస్తుందనుకునే సమయంలో మొత్తం నీటిపాలైంది. ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో, కౌలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. రెండు రోజుల్లోనే మా బతుకు మొత్తం అంధకారమయమైపోయింది. తక్షణమే పరిహారం చెల్లించాలి.
– పోతిరెడ్డి నాగరాజు, కౌలురైతు, వేగేశ్వరపురం
అప్పులు తీరే మార్గమేదీ
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పంట పండించాను. ఇప్పుడు అందులో రెండు ఎకరాలు పూర్తిగా నేలమట్టమైపోయింది. ఒక్కరాత్రిలోనే రూ.1.6 లక్షల నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు. పంట చేతికొస్తుందనుకుంటే ప్రకృతి నాశనం చేసేసింది. తక్షణమే ప్రభుత్వం ఆదుకుని పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి.
– కొరవటి చింతయ్య, కౌలు రైతు, వంగలపూడి
8
అర్నబ్ ధాటికి జరిగిన నష్టం (హెక్టార్లలో)
మండలం వరి నష్టపోయిన
రైతులు
అనపర్తి 3,400 7,802
బిక్కవోలు 4,960 6,450
చాగల్లు 1,100 850
దేవరపల్లి 633 435
గోకవరం 360 780
గోపాలపురం 220 212
కడియం 1,290 1,727 కపిలేశ్వరపురం 6,051 11,065 కోరుకొండ 930 1,358 కొవ్వూరు 602 782 మండపేట 6,983 10,115 నల్లజర్ల 1,550 950 నిడదవోలు 4,000 8,500
పెరవలి 960 1,052
రాజమండ్రి రూరల్ 729 918
రాజానగరం 2,253 3,240
రంగంపేట 1,350 2,380
రాయవరం 5,673 9,870
సీతానగరం 1,500 1,870
తాళ్లపూడి 1,942 1,221
ఉండ్రాజవరం 3,429 3,511
మొత్తం 49,915 75,088
అన్నదాతలపై అర్నబ్ పంజా
తుపానుకు 50 వేల
హెక్టార్లలో నేలకొరిగిన వరి
పంట చేతికందే వేళ తీరని శోకం
రంగు మారితే దిగజారనున్న నాణ్యత
గత నష్టాలకే పరిహారమివ్వని
చంద్రబాబు ప్రభుత్వం
ఇప్పుడు ఆదుకుంటారన్న నమ్మకం లేదంటున్న రైతులు


