● వరదలో కొట్టుకుపోయి
తండ్రి, ఇద్దరి కుమారుల మృతి
● శంఖవరంలో విషాదం
ప్రత్తిపాడు రూరల్ (శంఖవరం): అర్నబ్ తుపాను ఆ కుటుంబంలో కన్నీటి వరదను పారించింది. తండ్రి, ఇద్దరు కుమారులను దూరం చేసి, తీరని శోకం మిగిల్చింది. శంఖవరం గ్రామానికి చెందిన పిల్లా నారాయణరావు (ఎతిమాని) (55), ఆయన కుమారులు దుర్గాప్రసాద్ (30), రాజేష్ (20) పంపా వరదలో కొట్టుకుపోయి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పొలంలో మోటారు తెచ్చేందుకు బైక్‌పై వెళ్లిన వీరు శంఖవరం–మండపం రహదారిపై పంపా కాలువ దాటే క్రమంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ముగ్గురూ కొట్టుకుపోయి మృతి చెందారు.
చక్కని కుటుంబం
నారాయణరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె. వారిలో వారిలో ఒక కుమార్తెకు, కుమారుడికి వివాహాలు జరిగాయి. పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కుమారుడు రాజేష్ దివిలిలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. చదువుకుని జీవితంలో స్థిరపడతాడని ఆశలు పెట్టుకున్న కుటుంబానికి అతడి మరణం తీరని లోటుగా మారింది. పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్‌కు కొడవలి గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె కామేశ్వరమ్మతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భర్త మరణ వార్త విన్న కామేశ్వరమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది.
విషాద ఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదకు బలికావడంతో శంఖవరం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రకృతి వైపరీత్యం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడం స్థానికులను కలచివేసింది.
కంపెనీ పైకప్పు నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి
● వారిలో ఒకరు రాజమహేంద్రవరం వాసి
● తిరుపతి జిల్లాలో ఘటన
రేణిగుంట(తిరుపతి): రేణిగుంట మండలం గాజుల మండ్యం పారిశ్రామికవాడలోని పీఆర్ రోలింగ్ కంపెనీ పైకప్పు నుంచి జారిపడి గురువారం ఇద్దరు కార్మికులకు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఆ కంపెనీలో సుమారు 30 అడుగుల ఎత్తులోని పైకప్పుపై సిమెంట్ రేకులు అమర్చే పనిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్మాన్ (37), రాజమహేంద్రవరానికి చెందిన మధమణి వీర వెంకట గోపాల్ (29) నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో నిచ్చెన ఎక్కుతుండగా వారి బరువుకు సిమెంట్ రేకులు విరిగిపోవడంతో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోయి తీవ్ర రక్తగాయాలకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదే కంపెనీలో రెండు నెలల క్రితం ఒక కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.


