సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు చివరి రోజున ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 1న పోలింగ్, అవసరమైన చోట 2న రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో జిల్లాలోని నాలుగు డిపోల్లో బస్సులను రద్దు చేయడంతో ఆర్టీసీకి సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని జిల్లా ప్రజా రవాణా అధికారి మనోహర్ తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో 246 షెడ్యూల్ బస్సులను నడుపుతామని, తుపాను ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఆదేశాల మేరకు అన్ని సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపారు.
పారదర్శకంగా ఎన్నికలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ గురువారం సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, పుకార్లను వ్యాప్తి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై సైబర్ క్రైమ్ నిఘా ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యులవుతారన్నారు.
వరి పొలాల పరిశీలన
రాయవరం/అనపర్తి: తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను గురువారం జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయన రాయవరం, అనపర్తి, బిక్కవోలు మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ పంట చేలల్లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు కాలువలు, చేళ్లు వేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విద్యుత్ శాఖకు
రూ.1.25 కోట్ల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో జిల్లాలోని రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు డివిజన్లలోని 140 సబ్‌స్టేషన్ల పరిధిలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ గురువారం తెలిపారు. విద్యుత్ సమస్యల పునరుద్ధరణకు విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు 85 టీమ్‌ల ద్వారా ద్వారా 688 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
రెండు బోట్ల సీజ్
సాక్షి, రాజమహేంద్రవరం: కొవ్వూరు రూరల్ మండలం వాడపల్లి ఇసుక ర్యాంపు సమీపంలో నిషేధిత ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇసుకతో నిండిన రెండు బోట్లను గురువారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్, గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ అధికారులతో కూడిన సంయుక్త బృందం గురువారం తనిఖీలు నిర్వహించి ఈ చర్యలు చేపట్టింది. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, హేవలాక్ బ్రిడ్జి మధ్య ప్రాంతంలో అక్రమంగా ఇసుక తోడేస్తున్నారని, ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి బ్రిడ్జిల భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్నారని ‘గోదారమ్మ గర్భంలో ఇసుక తోడేళ్లు’ శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రెండు బోట్ల ద్వారా ఇసుకను తవ్వి, వాడపల్లి ర్యాంప్ వద్ద అన్‌లోడ్ చేస్తుండగా సీజ్ చేశారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన చిక్క గోవింద్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో ఇసుక తవ్వించి తరలిస్తున్నట్టు గుర్తించారు.


