ఎక్కడికక్కడే..! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడికక్కడే..!

Oct 29 2026 3:29 PM | Updated on Oct 29 2026 3:29 PM

● బస్సులకు బ్రేక్‌

● ప్రయాణాలు బంద్‌

● అర్నబ్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌

తుపాను కష్టాలు తెచ్చిపెట్టింది.. జన జీవనాన్ని స్తంభింపజేసింది.. బస్సులన్నీ బస్టాండ్లకే అతుక్కుపోయాయి. అర్నబ్‌ తెచ్చిన ఈదురు గాలులు, వర్షాలకు ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వెళ్లే దారులు మూసుకుపోయాయి. ఫలితంగా ప్రయాణాలన్నీ బంద్‌ అయ్యాయి.. కోనసీమ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులకు బ్రేక్‌లు పడ్డాయి. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఈదురుగాలుల బీభత్సనానికి బస్టాండ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

అమలాపురం రూరల్‌: అర్నబ్‌ తుపాను ప్రభావంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించింది. గాలులు తీవ్రత, వర్షం పెరగడంతో ప్రయాణాలు బంద్‌ అయ్యాయి. ప్రజలందరూ దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్ళిన బస్సు సర్వీసులు బుధవారం మధ్యాహ్నం డిపోలకు చేరుకున్నాయి. బస్సులు ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమవ్వగా, ఉద్యోగులు బస్టాండ్లలో వేచి ఉన్నారు. రవాణా వ్యవస్థ మెరుగైన తర్వాతే ప్రభుత్వం ఆదేశాలకు బస్సు నడుపుతామని కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ తెలిపారు. కోనసీమ జిల్లాలోని నాలుగు డిపోల్లో బస్సులు తిరగక గత రెండు రోజుల్లో సుమారు రూ.30 లక్షల ఆదాయం కోల్పోయామన్నారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థ, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

● జిల్లాలో సుమారు 8 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయని, 59 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కలెక్టర్‌ తెలిపారు. విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 2 వేల మందికి పైగా విద్యుత్‌ సిబ్బందిని రంగంలోకి దించినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాల స్థానంలో ఏర్పాటు చేసేందుకు 10 వేల కొత్త స్తంభాలను అందుబాటులో ఉంచామన్నారు. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం తదితర పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల కల్లా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని, మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి కల్లా సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

● జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో 93 ప్రధాన ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని కలెక్టర్‌ తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో రహదారులపై పడిన చెట్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 13 వేల మంది ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అక్కడ బాధితులకు ఆహారం, సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు తదితర మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, అవసరమైన ప్రాంతాల్లో డీజిల్‌ జనరేటర్ల ద్వారా తాగునీటి సరఫరాను కొనసాగించడంతో పాటు నీటి శుద్ధికి క్లోరినేషన్‌ చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా అరటి, కొబ్బరి, కోకో తదితర ఉద్యాన పంటలు సుమారు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేవామన్నారు.

హోం మంత్రి అనిత పర్యటన

ఉప్పలగుప్తం: మండలంలోని భీమనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌ బాబు, కలెక్టర్‌ మహేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బుధవారం పరిశీలించారు. అక్కడి బాధితులను పరామర్శించి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement