● తుపాను కారణంగా
తగ్గిన భక్తుల సందడి
● పదుల సంఖ్యలో కూడా రాని వైనం
● దేవస్థానంలో కూలిన చెట్లు
అన్నవరం: అర్నబ్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తుల రాక ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం వెలవెల బోయింది. సాధారణంగా అమావాస్య నాడు సైతం వందల సంఖ్యలో భక్తులు సత్యదేవుని ఆలయానికి విచ్చేస్తుంటారు. స్వామివారి వ్రతాలు కనీసం వంద అయినా అవుతుంటాయి. ప్రస్తుత ఆశ్వీయుజమాసంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కానీ రెండ్రోజులుగా స్వామివారి ఆలయానికి భక్తులు చాలా తక్కువగా వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వరకు తుపాను ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఓ మాదిరిగా భక్తులు కనిపించినా మంగళవారం మధ్యాహ్నం నుంచి అసలు భక్తులే కరువయ్యారు. ఇక బుధవారం భక్తుల్లేక రత్నగిరిపై వ్యాపారస్తులు తమ దుకాణాలను తెరవలేదు. దీంతో దేవస్థానంలో ఎటువంటి సందడి లేకుండా నిర్మానుష్యం నెలకొంది. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తుపానుకు ముందు దేవస్థానానికి విచ్చేసి, వర్షాల కారణంగా తమ స్వస్థాలాలకు వెళ్లే అవకాశం లేక సత్రాల్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల ని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు.
విద్యుత్‌కు అంతరాయం
ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా మంగళవారం రాత్రి అన్నవరం దేవస్థానంలో చెట్లు నేల కూలాయి. అలాగే కొన్నిచోట్ల విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీఆర్వో కార్యాలయం ఎదురుగా గల భారీ వృక్షం కూలిపోయింది. ఆ ప్రదేశంలో భక్తుల కొత్త వాహనాలకు పూజలు చేయిస్తుంటారు. అయితే చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎటువంటి వాహనాలు, భక్తులు, పురోహితులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దేవస్థానం సిబ్బంది ఆ చెట్లు నరికి అడ్డు లేకుండా తొలగించారు. అలాగే దేవస్థానంలో పలు చోట్ల ఆ విద్యుత్ స్థంబాల వైర్లు తెగిపోవడంతో విద్యుత్ శాఖ డీఈ వి.సత్యనారాయణ సరఫరాను నిలిపివేశారు. దీంతో కొన్ని ప్రాంతాలలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. అనంతరం దేవస్థానం సిబ్బంది విద్యుత్ తీగలు మరలా కలిపి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు రత్నగిరిపై పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా ఘాట్‌రోడ్ల మీద చెట్లు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున దేవస్థానం ఘాట్‌రోడ్ల మీద ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు కోరారు.


