శ్రీవారికి వసంతోత్సవ వైభవం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి వసంతోత్సవ వైభవం

Oct 29 2026 3:29 PM | Updated on Oct 29 2026 3:29 PM

ద్వారకాతిరుమల: వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. వర్షం కారణంగా ఉత్సవాలను అర్చకులు, పండితులు ఆలయంలోనే వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రదక్షిణ మండపంలో శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి చూర్ణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ క్రమంలో స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. అనంతరం ఆలయ సిబ్బందికి, భక్తులకు వసంతాలను అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామివారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఆలయ ముఖ మండపంలో స్వామివారి శయన మహావిష్ణువు అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ విశేష వేడుకలతో శ్రీవారి దివ్య బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

నేటి నుంచి ఆర్జిత సేవలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిలిపి వేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను గురువారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

వేడుకగా చూర్ణోత్సవం,

శ్రీపుష్ప యాగోత్సవం

వర్షం కారణంగా ఆలయంలోనే

జరిగిన వేడుకలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement