ఏలేశ్వరం: అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాల కారణంగా ఏలేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఏలేరు పరివాహక ప్రాంతం నుంచి 9,833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు గాను 83.50 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 18.24 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. విశాఖకు వంద క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేశారు.
నేడు నన్నయ
యూనివర్సిటికీ సెలవు
రాజానగరం: అర్నబ్ తుపాను ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. రిజిస్ట్రార్ కేవీ స్వామి బుధవారం ఈ విషయం తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవు ఇచ్చామన్నారు.
2 నుంచి ఫ్లషింగ్ ఆపరేషన్
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద నవంబర్ 2 నుంచి ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఆ రోజు పశ్చిమ డెల్టా, 3న మధ్య డెల్టా, 4న తూర్పు డెల్టాలకు స్కవర్ స్లూయిజ్ వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. రబీ సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. వరదల సీజన్‌లో ఎగువ నుంచి కొట్టుకువచ్చి బ్యారేజీ గేట్ల వద్ద పేరుకు పోయిన మట్టి దీని ద్వారా దిగువకు కొట్టుకుపోతుందన్నారు.
పోలీస్ వాహనంపై కూలిన తాటిచెట్టు
కంబాలచెరువు: తుపానులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. తుపాను కారణంగా కురిసిన వర్షానికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కి వెళ్లే రహదారిలో గూడ్స్ గేటు వద్ద నీరు చేరింది. దీంతో పలు వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో టూటౌన్ పోలీసులు తమ రక్షక్ వాహనాన్ని అక్కడ నిలిచి, ఆ దారిలో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ సమయంలో వీచిన గాలికి ఓ తాటిచెట్టు ఆ పోలీసు వాహనంపై పడింది. జీపులో ఎవరు లేకపోవడం ప్రమాదం తప్పింది. చెట్టు పడడంతో జీపు ధ్వంసమైంది.


