లో
బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
రాష్ట్రంలో కడుతున్న రాజధాని అమరావతి పూర్తయితే ఇంత గొప్పగా ఉంటుందంటూ ఆకాశాన్నంటే గ్రాఫిక్స్ భవనాలను చూపించిన చంద్రబాబు ఇప్పుడు మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతతో రియల్‌గా బలహీనంగా ఉన్న తన పాలనను.. రీల్స్‌తో తారస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గొప్పగా ఉందంటూ రీల్స్ చేసేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ఆఫర్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సేవలు అందించిన వలంటీర్లకు నెలకు రూ.5 వేల ఇస్తేనే అప్పట్లో గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు రీల్స్ కోసం అన్ని లక్షల రూపాయలు ఎలా ఖర్చు
చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
● సర్కార్‌కు డప్పుకొడితే కాసుల వాన
● చంద్రబాబు ప్రభుత్వ కొత్త విధానం
● సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో
పథకాలపై ప్రచారం
● కొత్త పాలసీపై ప్రజల ఆగ్రహం
● ఎన్నికల హామీలు అమలు
చేయాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం/కపిలేశ్వరపురం/నిడదవో లు రూరల్/అనపర్తి/సీతానగరం: ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు లేదని చెప్పే చంద్రబాబు.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రచారానికి మాత్రం కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. చేసిన సంక్షేమం అంతగా లేకపోయినా, సూపర్, అద్భుతమంటూ ప్రచారం చేసేందుకు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను వినియోగించుకుంటున్నారు. దాని కోసం వారికి డబ్బు చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్ద చేర్చే వలంటీర్‌కు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. అప్పట్లో దానిపై రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు లక్షల రూపాయలను సోషల్ మీడియా ప్రతినిధులను ఖర్చు చేయనున్నారు.
ప్రభుత్వ తీరుపై జనాగ్రహం
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను డబ్బు చెల్లించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై జనం మండిపడుతున్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో 27 నెలలు గడిచినా పథకాలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానాలో డబ్బు లేదని కబుర్లు చెబుతున్న పాలకులు.. ప్రచారానికి మాత్రం రూ.లక్షలు ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో దుష్ప్రచారం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు పనిచేసిన వలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తుంటే నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, అతడి భజన మీడియా నానా యాగీ చేసింది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విస్తృతంగా అసత్య ప్రచారం చేసింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి నాడు నోటికొచ్చిన ఆరోపణలన్నీ చేసేశారు. వలంటీర్ల వల్లే అమ్మాయిలు అదృశ్యమవుతున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. వాస్తవానికి వలంటీర్ల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది.జిల్లాలో పని చేసిన 5 వేల మందికి పైగా వలంటీర్లు.. ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేవారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు వలంటీర్లు ఇంటింటికీ అందించిన సేవలు వెలకట్టలేనివి. రేషన్ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలు, ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారు. అలాంటి వారికి చెల్లించిన గౌరవ వేతనాన్ని అప్పట్లో ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విమర్శించిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని మొండి చేయి చూపారని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచార యావ
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేటికీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు పంపిణీ వంటి పథకాల అమలుపై కనీసం ఆలోచించడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు దోచిపెట్టేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించకుండా ప్రజాధనంతో సొంత డబ్బా కొట్టుకునేందుకు సిద్ధమవడం సిగ్గు చేటని జిల్లా వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఐటీడీపీ సభ్యులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే చంద్రబాబు లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవి మరిచావా బాబూ..
● 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తామని చంద్రబాబు గొప్పగా హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3.6 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని ప్రాథమిక అంచనా. వారంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ పథకం ప్రారంభానికి మాత్రం చంద్రబాబు సిద్ధమవడం లేదు.
● 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ పింఛన్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన మాట గాలిలో కలిసిపోయింది. జిల్లాలో సుమారు 1.2 లక్షల మంది ఉంటారని ప్రాథమిక అంచనా. 27 నెలల తర్వాత పింఛన్ల డ్రామాకు తెరతీసిన చంద్రబాబు ఇప్పుడు కూడా 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భరోసా ఇవ్వలేదు.
● మరో వైపు చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తామన్నారని, ఆ లెక్కన ఇప్పటి వరకూ ఒక్కో నిరుద్యోగికి రూ.81 వేలు చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికై నా ఆ పథకం అమలు చేయాలని జిల్లాలోని 2.3 లక్షల మందికిపైగా ఉన్న నిరుద్యోగులు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు.
ప్రచారానికే రూ.లక్షలా
ప్రభుత్వం తరఫున ప్రచారం చేసే వారికే రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవ్వడం దారుణం. నాడు సేవాభావంతో పనిచేసే మాలాంటి వలంటీర్లకు రూ.5 వేల చొప్పున ఇస్తేనే చంద్రబాబు, పవన్, లోకేశ్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి ప్రజాధనం దోచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చాలా దారుణ నిర్ణయం.
– నేటి గణేష్, తాడిమళ్ల, నిడదవోలు మండలం
ప్రజాధనం దుర్వినియోగం
ప్రభుత్వానికి డబ్బా కొట్టించుకునేందుకు ప్రజాధనం ఖర్చు చేయడం సరికాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్న పాలకులు.. రీల్స్ చేసే వారికి రూ.లక్షలు ఎలా చెల్లించాలనుకుంటున్నారు. వలంటీర్‌గా సేవలందించిన మాకో న్యాయమా,
రీల్స్ చేసే వారికో న్యాయమా?.
– పులగం శివారెడ్డి, రామవరం, అనపర్తి మండలం
8
సేవా భావంతో చేసినా విమర్శలే
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు వలంటీర్‌గా పని చేశాను. పింఛన్లు ఇవ్వడం, ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించాను. అయినా కొందరు నోటికొచ్చినట్లు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్సి కొనసాగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
– ముషిని సుబ్రహ్మణ్యం,
అంగర, కపిలేశ్వరపురం మండలం
తొలగించడం దారుణం
కేదారిలంక గ్రామంలో వలంటీర్‌గా సేవలందించాను. ఏటా వరదల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ప్రజలకు అన్ని సమయాల్లో అండగా నిలిచేవాడిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా తొలగించింది. పైగా కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చి మోసగించింది.
– కె.రమేష్, కేదారిలంక,
కపిలేశ్వరపురం మండలం
కూటమి తీరు దారుణం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో సేవాభావంతో పనిచేశాం. తెల్లవారుజాము 5 గంటలకే పింఛన్లు అందించేవాళ్లం. మాకు ఇచ్చే రూ.5 వేల విషయంపై నాడు టీడీపీ నాయకులు ఎంతో దుష్ప్రచారం చేశారు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో వారి ప్రభుత్వ ప్రచారానికే రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవడం దారుణం.
– ఎస్.చిన్నారి, రఘుదేవపురం,
సీతానగరం మండలం


