ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రి 9.30 అడుగులకు నీటి మట్టం చేరింది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. బ్యారేజీ నుంచి మంగళవారం రాత్రి 6,38,771 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతానికి సంబంధించి భద్రాచలంలో 30.70 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గడంతో బుధవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
పెన్షనర్ల సమస్యలను
పరిష్కరించాలి
రాజమహేంద్రవరం రూరల్: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ రాజమహేంద్రవరం జిల్లా శాఖ అధ్యక్షుడు కేజీకే మూర్తి డిమాండ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల ఫెడరేషన్ న్యూఢిల్లీ నిర్ణయం మేరకు రాష్ట్ర సంఘం పిలుపుతో బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల సమస్యల సాధనకు ధర్నా చేశారు. మూర్తి మాట్లాడుతూ 2025 మార్చిలో పార్లమెంటు ఆమోదించిన పెన్షన్ నిబంధనలను ఉపసంహరించుకోవాలన్నారు. డీఎస్ నకారా తీర్పును సమర్థించాలన్నారు. ప్రతి పే కమిషన్‌లో పెన్షన్ సవరణను నిర్థారించాలన్నారు. ఈ ఏడాది జనవరి ఒకటికి ముందు ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణను చేర్చడానికి 8వ సీపీసీ విధి విధానాలను సవరించాలన్నారు. డీఏ, డీఆర్‌లో 50 శాతాన్ని జీతం, పెన్షన్‌లో విలీనం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.
ఒకటిన కలెక్టరేట్ వద్ద
వీఆర్‌ఏల ధర్నా
రాజానగరం: సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చేస్తున్న ఆందోళనలో భాగంగా అక్టోబర్ ఒకటిన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు జిల్లాలోని వీఆర్‌ఏలందరూ తరలి రావాలని వీఆర్‌ఏల జిల్లా సంఘం అధ్యక్షుడు మల్లిమొగ్గల వెంకటరమణ పిలుపునిచ్చారు. రాజానగరంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పేస్కేల్ అమలు చేయాలని, వారసులకు తదుపరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్లతో వీఆర్‌ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కమిటీ సురేష్, కార్యదర్శి ప్రత్తి చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
చాగల్లులో వంటావార్పు
చాగల్లు: మండల వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం మంగళవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చాగల్లులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తరహాలో పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా వీఆర్‌ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు అవిడి రామకృష్ణ, షేక్ అహ్మద్ బాబా, వడ్లమూడి మధుబాబు పాల్గొన్నారు.


