సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలి

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● ఓటర్ల జాబితా నుంచి తొలగించిన

ప్రతి పేరుకు లెక్క చెప్పాలి

● అఖిల పక్ష రౌండ్‌ టేబుల్‌

సమావేశంలో వక్తలు

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణ పేరుతో భారీగా ఓట్ల తొలగింపునకు కారణమైన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరంలోని కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ అధ్యక్షత వహించారు. వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, వైఎస్సార్‌ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, జీవీ సుందర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పునఃపరిశీలించాలి

భరత్‌రామ్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల నియామక విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాలపై 14 సందర్భాల్లో లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనాన్ని ఉటంకించారు. సెప్టెంబర్‌ 26న ముగ్గురు కమిషనర్లు కలిసి నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో గతంలో వ్యక్తమైన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను అధికార పార్టీ ప్రయోజనాలకు వినియోగించకూడదన్నారు. 2019, 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆరోపించారు. టి.అరుణ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న రాజమహేంద్రవరం కంబాలచెరువులోని దండి మార్చ్‌ విగ్రహాల వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు. జీవీ సుందర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారన్న నేపథ్యంలో మృతులు, డూప్లికేట్‌ నమోదులు, ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, అర్హత ఉన్నప్పటికీ జాబితా నుంచి తొలగించబడినవారి వివరాలను విడివిడిగా ప్రజలకు వెల్లడించాలని కోరారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలని, ఎన్నికల సంస్థలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కొండలరావు, కాంగ్రెస్‌ నగర నాయకుడు బాలేపల్లి మురళీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.పవన్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రాపు రాంబాబు, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కె.జోజి సీఐటీయూ నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి, ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు నల్ల రామారావు మహిళా కాంగ్రెస్‌ నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement