హక్కులకై ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలా! | - | Sakshi
Sakshi News home page

హక్కులకై ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలా!

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● సచివాలయ ఉద్యోగులపై

పోలీసుల ప్రతాపం దారుణం

● చంద్రబాబు ప్రభుత్వ తీరు సరి కాదు

● ఉద్యోగ, ప్రజా సంఘాల

నాయకుల ఆగ్రహం

సాక్షి, రాజమహేంద్రవరం/కపిలేశ్వరపురం/సీటీఆర్‌ఐ/ప్రకాశం నగర్‌/నిడదవోలు రూరల్‌/రాజమహేంద్రవరం రూరల్‌ : ‘‘సమస్యలు పరిష్కరించాలని కోరడం నేరమా? ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులు తమ హక్కుల కోసం గళమెత్తితే అణచివేయడమే ప్రభుత్వ విధానమా? న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడకు తరలి వెళ్లిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు’’ అని ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. చలో విజయవాడ పేరుతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం, పలుచోట్ల నిర్బంధించడం, ధర్నా చౌక్‌కు చేరుకోకుండా నిలువరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిరసనకారులను బలవంతంగా తరలించడమే కాకుండా, మహిళా ఉద్యోగులతో కూడా దురుసుగా వ్యవహరించడంతో ప్రభుత్వ తీరును ఉద్యోగ సంఘాలతోపాటు రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులపై కర్కశత్వం

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలివెళ్లారు. అయితే, నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోకి వెళ్లే మార్గాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా ఉద్యోగులను అడ్డుకున్నట్లు సంఘాల నాయకులు ఆరోపించారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ధర్నా చౌక్‌ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్కడికి చేరుకున్న ఉద్యోగులు రోడ్లపై బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారిని అక్కడి నుంచి తరలించే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, ఉద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడలోనే సుమారు 600 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన మహిళా ఉద్యోగులను సైతం బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారిపై కర్కశంగా వ్యవహరించడం సరికాదన్నారు.

అణచివేత ధోరణి

సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం అణచివేత ధోరణికి దిగింది. కూటమి నియంతృత్వానికి సచివాలయ ఉద్యోగులపై దాడే నిదర్శనం. సామాన్య ప్రజలకు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగులపై దాడి అప్రజాస్వామికం. వారిపై అక్రమంగా పెట్టిన కేసులు తొలగించాలి.

– కె.కృష్ణవేణి, సీఐటీయూ

రాష్ట్ర కార్యదర్శి, మండపేట

హామీలు అమలు చేయాలి

సచివాలయ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఇప్పటికే పని ఒత్తిడి పెరిగిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతే మరికొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలన్నీ పరిష్కరించాలి.

– ఎం.పట్టాభిరామ్‌, సచివాలయ

ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement