గుర్తింపు దొరికేనా! | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు దొరికేనా!

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

ఆలమూరు: రైతుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చినట్టు చెబుతున్న ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఐడీ) నమోదు ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. అనేక మంది రైతులు రెవెన్యూ పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో విశిష్ట గుర్తింపు నమోదు పక్రియ వేగంగా మందుకు వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమకు గుర్తింపు ఎప్పుడు దొరుకుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆధార్‌ కార్డు మాదిరిగా..

దేశ పౌరులందరికీ ఇచ్చిన ఆధార్‌ కార్డు మాదిరిగానే సొంత భూమి ఉన్న రైతుల కోసం ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఐడీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆధార్‌ కార్డు తరహాలోనే రైతులకు కూడా 11 అంకెలతో కూడిన ప్రత్యేక నంబర్‌ను అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీ (ఏపీఎఫ్‌ఆర్‌) పథకాన్ని అమలు చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ పంచాయతీల్లో ఉన్న ఆర్‌ఎస్‌కేల్లో యూనిక్‌ ఐడీ నమోదు పక్రియ సాగుతోంది. ఈ గుర్తింపు సంఖ్యను పొందడం వల్ల వ్యవసాయశాఖ ద్వారా అందించే అన్ని సౌకర్యాలు, పౌర సేవలు, ప్రభుత్వ పథకాలను నేరుగా రైతులకు చేరతాయని వ్యవసాయశాఖ చెబుతోంది.

ముందుకు కదలక..

కోనసీమ జిల్లాలో 2.35 లక్షల ఆయకట్టు ఉండగా సుమారు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 2.65 లక్షల మంది పీఎం కిసాన్‌ పథకాన్ని అర్హత సాధించారు. అయితే ఈ నెలాఖరు నాటికి ఇప్పటి వరకూ కేవలం 1.48 లక్షల మంది మాత్రమే విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందగలిగారు. మిగిలిన రైతులు వివిధ కారణాల వల్ల, రెవెన్యూ సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల దూరమయ్యారు. నమోదు పక్రియ కూడా అనుకున్నంత స్థాయిలో ముందుకు కదలడం లేదు.

వేధిస్తున్న రెవెన్యూ సమస్యలు

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు పక్రియను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యలు వెంటాడుతున్నాయి. వారసత్వంగా సంక్రమించిన భూములు వెబ్‌సైట్‌లో కనిపించక పోవడం, వక్ఫ్‌ భూములు, 22ఏ సమస్యలు, దేవదాయశాఖ భూమి జాబితాల్లో రైతుల సొంత భూమి నమోదు కావడం, భూమి ఒకరిదైతే వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరున ఉండడం, 1బీల్లో ఒకరికి భూమి తక్కువగా, మరొకరికి ఎక్కువగా చూపించడం వంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో కొనుగోలు చేసిన భూముల వివరాలు మళ్లీ కూటమి ప్రభుత్వంలో విక్రేతదారుడి పేరిట వెనక్కి వెళ్లిపోవడం వల్ల రైతులు తరచూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నమోదు తప్పనిసరి

విశిష్ట గుర్తింపు సంఖ్యను రైతులందరూ నమోదు చేసుకోవాలి. దీనిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అన్ని స్వర్ణ గ్రామ పంచాయతీల పరిధిలోని ఆర్‌ఎస్‌కేల్లో నమోదు పక్రియ జరుగుతోంది.

– ఏవీ రామారావు,

జిల్లా వ్యవసాయాధికారి, కోనసీవ

ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డుల

కోసం రైతుల అవస్థలు

మందకొడిగా ప్రక్రియ

క్షేత్రస్థాయిలో

రెవెన్యూ సమస్యలతో జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement