స్వామి ప్రసాదం.. మరింత రుచికరం | - | Sakshi
Sakshi News home page

స్వామి ప్రసాదం.. మరింత రుచికరం

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● అన్నవరం దేవస్థానం ప్రణాళిక

● ట్రస్ట్‌బోర్డు ఆమోదిస్తే కార్యాచరణ

అన్నవరం: సత్యదేవుని గోధుమనూక ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. తిరుపతి వేంకటేశ్వరస్వామివారి లడ్డూ తర్వాత ఈ ప్రసాదం ఎంతో ప్రాముఖ్యత సాధించింది. ఇంతటి ప్రాధాన్యమున్న గోధుమనూక ప్రసాదాన్ని మరింత రుచికరంగా, నాణ్యతగా తయారు చేసి భక్తులకు అందించేందుకు అన్నవరం దేవస్థానం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు బుధవారం జరిగే ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.

ప్రసాదాల విక్రయంతో రూ.30 కోట్లు

అన్నవరం దేవస్థానం వార్షికాదాయం సుమారు రూ.150 కోట్లు కాగా, అందులో 20 శాతం అంటే రూ.30 కోట్లు స్వామివారి ప్రసాదం విక్రయాల ద్వారానే రావడం విశేషం. అయితే ఇటీవల స్వామివారి ప్రసాదం తెల్లగా ఉందని, గతంలో మాదిరిగా రుచిగా లేదని, త్వరగా పాడవుతోందనే ఆరోపణలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసాదాన్ని మరింత రుచికరంగా చేసేందుకు మార్పులు చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

ప్రతిపాదనలు

ప్రస్తుతం సత్యదేవుని ప్రసాదం తయారీలో తెల్ల గోధుమలు, ఎం–30 రకం పంచదారను వినియోగిస్తున్నారు. ఇక నుంచి ఎర్ర గోధుమలు, ఎం– 31 రకం పంచదార ఉపయోగించాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే సత్యదేవుని ప్రసాద భవనాన్ని విస్తరించేందుకు, ప్రసాదం ప్యాకర్లకు వేడి తగలకుండా భవనం పైభాగంలో షెడ్డు నిర్మించి ప్రసాదం అక్కడకు లిఫ్ట్‌ ద్వారా తరలించి అక్కడ ప్యాకింగ్‌ చేయించాలని ప్రతిపాదించారు. ప్రసాద భవన నిర్మాణ దాత, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు గౌరవ సలహాదారు మట్టే సత్యప్రసాద్‌ తన సొంత ఖర్చుతో ఈ నిర్మాణాలు చేయడానికి ప్రతిపాదించారు.

ఎర్ర గోధుమ నూక ధర ఎక్కువే..

ప్రస్తుతం దేవస్థానానికి టెండర్‌ దారుడు సరఫరా చేస్తున్న తెల్ల గోధుమనూక కిలో రూ.34.20 కాగా, ఎర్ర గోధుమనూక రేటు మార్కెట్‌లో రూ.62 నుంచి 65 మధ్యలో ఉంది. దీంతో ఎర్ర గోధుమతో ప్రసాదం తయారు చేస్తే దేవస్థానానికి ఆర్థిక భారమే అని చెప్పవచ్చు. కాగా, అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి తెల్ల గోధుమ సరఫరా చేయడానికే టెండర్‌ పిలవగా కేజీ రూ.38కి లోయెస్ట్‌ కొటేషన్‌ దాఖలు చేసినట్టు సమాచారం. అయితే ఎర్ర గోధుమ కొనుగోలుకు ట్రస్ట్‌బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఆ మేరకు టెండర్‌ పిలవనున్నారు.

తగ్గనున్న లాభం

దేవస్థానంలో 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్‌ను రూ.20కి విక్రయిస్తుండగా, దానిలో దేవస్థానానికి రూ.రెండు లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే ఎర్ర గోధుమ నూకతో తయారు చేస్తే ఒక ప్యాకెట్‌కు ఒక్క రూపాయి మాత్రమే లాభం వస్తుందని తెలుస్తోంది. అయితే ఎర్ర గోధుమనూక, ఎం–31 రకం ప్రసాదంతో తయారు చేస్తే ప్రసాదం దిగుబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ట్రస్ట్‌బోర్డులో చర్చిస్తాం

ఎర్ర గోధుమనూక, ఎం–31 రకం పంచదార వాడడం ద్వారా భక్తులకు మరింత రుచిగా ప్రసాదాన్ని అందించేందుకు రూపొందించిన ప్రణాళికను ట్రస్ట్‌ బోర్డుకు నివేదించాం. అదే విధంగా ప్రసాద భవనం విస్తరణకు అవసరమైన వ్యయాన్ని భరించేందుకు ప్రసాద భవన నిర్మాణ దాత మట్టే సత్యప్రసాద్‌ అంగీకారం తెలిపారు. వీటిపై కూడా ట్రస్ట్‌బోర్డు తీర్మానం మేరకు చర్యలు తీసుకుంటాం.

– నల్లం సూర్యచక్రధరరావు,

అన్నవరం దేవస్థానం ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement