గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

చింతూరు: ఘాట్‌ రోడ్డులోని వ్యూ పాయింట్‌ వద్ద సోకిలేరు వాగులో ఆదివారం గల్లంతైన బుంగా బాల వందన్‌ (18) మృతదేహం మంగళవారం నదిలో లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బాల వందన్‌ విహారయాత్రకు కుటుంబ సభ్యులతో వ్యూ పాయింట్‌ వద్దకు వచ్చి సోకిలేరు వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా అతడి ఆచూకీ కోసం సీఐ గోపాలకృష్ణ, ఎస్సై నాసిర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తొండంగి: మద్యానికి బానిసై మనస్తాపంతో గడ్డి మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం యర్రయ్యపేట పంచాయతీ కుమ్మరిపేటకు చెందిన కుమ్మరి ఏసయ్య (48) ఎద్దుల బండి కిరాయికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. మద్యానికి బానిస కావడంతో బాగా అప్పులు చేశారు. ఈ నేపథ్యంలో భార్య వెంకటలక్ష్మితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇంటి దగ్గరలో పొలానికి వెళ్లి గడ్డి మందు తాగాడు. గుర్తించిప వెంకటలక్ష్మి, కుటుంబసభ్యులతో కలిసి అపస్మారక స్ధితిలో ఉన్న ఏసయ్యను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యం పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌

పోటీలకు అస్మిత

కరప: మండలంలోని వేళంగి మెర్ల జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పుల్లెపు అస్మిత రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపికై ంది. పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ పాఠశాల మైదానంలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు మాట్లాడుతూ అస్మిత త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. బాలికతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు కంకణాల శ్రీనివాసరావు, గుబ్బల వేణుగోపాలరావులతో పాటు స్థానిక మార్షల్‌ ఆర్ట్స్‌ కోచ్‌ లవరాజును అభినందించారు. అలాగే పాఠశాల వ్యవస్థాపక వారసులు మెర్ల వీరయ్య చౌదరి, బోండా వెంకన్నరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌, సభ్యులు అభినందనలు తెలిపారు.

క్షేమంగా ఇంటికి చేరిన బాలురు

దేవరపల్లి: గోపాలపురంలోని ఉప్పరగూడెంలో సోమవారం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ఇద్దరు బాలురు దొరికినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. తాడేపల్లిగూడెం బస్టాండ్‌ వద్ద ఆ ఇద్దరిని గుర్తించామన్నారు. సోమవారం స్కూల్‌కు వెళ్లకపోయిన విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందనే భయంతోనే వారు ఇంటి నుంచి పారిపోయారన్నారు. వారిద్దరినీ తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement