రాజమహేంద్రవరం సిటీ: చలో విజయవాడ సందర్భంగా ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ 5 సాంబశివరావుపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాకలపాటి గిరి ప్రసాద్ వర్మ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఏపీజీఈఏ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో, ఆయా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వేలాది మంది ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారని తెలిపారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు రాజకీయాలను ఆపాదిస్తూ, వారిని అవమానించే విధంగా అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించడం అభ్యంతరకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఏపీజీఈఏ తీవ్రంగా ఖండిస్తోందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వేలమంది పాల్గొనే ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనల్లో వ్యక్తిగత వ్యాఖ్యలతో ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీయడం సమర్థనీయం కాదన్నారు. టీవీ 5 యాజమాన్యం స్పందించి, సంబంధిత వ్యాఖ్యలపై ఉద్యోగులకు బహిరంగంగా వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో సచివాలయ ఉద్యోగుల సంఘాలతో కలిసి ఏపీజీఈఏ ప్రజాస్వామ్య పద్ధతిలో తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ఏపీజీఈఏ సచివాలయ విభాగం జిల్లా అధ్యక్షుడు వరసాల రామదాసు మాట్లాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఉద్యోగులను వ్యక్తిగతంగా కించపరిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు జీబీ విజయకుమార్, ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


