● తాడిపూడిలో ఘటన
● నదిలో పోలీసుల గాలింపు
తాళ్లపూడి: మండలంలోని తాడిపూడి వద్ద గోదావరిలో ఓ మహిళను గెంటివేశారన్న వార్త కలకలం రేపింది. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ, బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన వింటి ఆదిలక్ష్మి (36) తాళ్లపూడిలోని ఓ స్వీట్ షాపులో పనిచేస్తోంది. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి 7 గంటల సమయంలో షాపులో పనిముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో తాడిపూడి గ్రామానికి చెందిన షేక్ యాకోబు ఆటో ఎక్కింది. అతడు తాడిపూడి శ్మశాన రేవు వద్ద ఆమెను గోదావరిలో తోసేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం గోదావరిలో ఆదిలక్ష్మి కోసం పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. ఆదిలక్ష్మి భర్త లేడు. వివాహమైన కుమార్తె ఉంది.


