తప్పుడు లెక్కలు.. రూ.లక్షలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు లెక్కలు.. రూ.లక్షలకు రెక్కలు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

డి.రావులపాలెం పంచాయతీ బిల్లుల్లో

అవకతవకలు

జనసేన మాజీ సర్పంచ్‌పై ఫిర్యాదు

ఇంటి పన్ను వసూలులోనూ

కార్యదర్శి చేతివాటం

అల్లవరం: లెక్కల్లో తప్పులు చూపించి, లక్షల రూపాయలను దర్జాగా నొక్కేశారు. ఆపై ఇంటి పన్నుల వసూలులోనూ చేతివాటం చూపారు. ఇలా ప్రభుత్వ సొమ్ములను తన సొంత డబ్బులా వాడుకున్నారు. అల్లవరం మండలం డి.రావులపాలెం పంచాయతీలో సిబ్బంది తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన పప్పుల దుర్గాప్రసాద్‌ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు, కలెక్టర్‌కు, డీపీఓకు ఫిర్యాదు చేశారు. 2018 నుంచి ఫిబ్రవరి 2026 వరకు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన పంచాయతీ జమాఖర్చుల్లో లోపాలను గుర్తించి ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌, ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు ఈ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాలు ఇవీ..

డి.రావులపాలెం పంచాయతీలో 2018 నుంచి 2026 ఫిబ్రవరి వరకు వివిధ పనులు చేసినట్టు బిల్లులు పెట్టి సుమారు రూ.86.17 లక్షలు తీసుకున్నారు. మొంథా తుపాను సమయంలో ప్రజలకు సరఫరా చేసిన తాగునీరు, ముగ్గు, బ్లీచింగ్‌, పారిశుధ్యానికి సంబంధించి ఖర్చు, 2024 నుంచి క్లాప్‌ మిత్రలకు ఇచ్చిన జీతాలు, ఈఓపీఆర్‌డీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే కంప్యూటర్‌ ఆపరేటర్‌కు ఈ పంచాయతీ నుంచే జీతాలు చెల్లించినట్లుగా పలు బిల్లులు సృష్టించారు. వాటితో దర్జాగా డబ్బులను డ్రా చేసుకున్నారు. వాస్తవానికి ఆ డబ్బులో దాదాపు రూ.40 లక్షలు కుడా ఖర్చు చేయలేదని ఫిర్యాదుదారుడు తెలిపాడు.

కార్యదర్శి దందా!

ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న ఓ కార్యదర్శి ప్రజల నుంచి ఇంటి పన్నులు వసూలు చేసుకుని, రశీదు ఇవ్వడం లేదు. పన్ను డిమాండ్‌ నోటీసులపై ఫెయిడ్‌ అని రాసి ప్రజలకు ఇస్తున్నాడు. రశీదు కోసం నిలదీసిన వారికి మాత్రం డబ్బులను వాపస్‌ చేస్తున్నాడు. ఈ విషయంపై కూడా దుర్గా ప్రసాద్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కార్యదర్శిని నమ్మి ఇంటి పన్ను డబ్బులు ఇస్తే డిమాండ్‌ నోటీసులు ఇచ్చి మోసానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపినట్టు ఆయన చెప్పాడు. గత సర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది కుమ్మకై ్క ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందన లేదని ఆరోపించాడు. ఈ అవకతవకలపై కలెక్టర్‌ స్పందించి, పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విషయంపై డీఎల్‌పీఓ బొజ్జిరాజును వివరణ కోరగా ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారని, రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement