ఆశలన్నీ సన్నగిల్లి.. | - | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ సన్నగిల్లి..

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

ప్రజలకు అతి తక్కువ ధరకే సన్నబియ్యం అందిస్తామని చంద్రబాబు సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసింది. మార్కెట్‌ ధర కన్నా తక్కువకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆర్భాటంగా ప్రారంభించింది. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. దీంతో తక్కువ ధరకే సన్నబియ్యం పొందాలన్న ప్రజల ఆశలు సన్నగిల్లిపోయాయి.

సన్నబియ్యం అందించడంలో

చంద్రబాబు విఫలం

కాగితాల్లోనే 46 బియ్యం

విక్రయ కేంద్రాలు

క్షేత్ర స్థాయిలో సగానికి పైగా క్లోజ్‌

మిల్లర్ల నుంచి సరఫరా లేక మూసివేత

సాక్షి, రాజమహేంద్రవరం: బహిరంగ మార్కెట్‌లో స న్నబియ్యం ధరలు మండిపోతున్నా చంద్రబాబు స ర్కార్‌ నియంత్రించలేకపోతోంది. మరో వైపు సామాన్యులకు తక్కువ ధరకు సన్నబియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ప్రోగ్రాం (ఎంఐపీ) కింద కిలో బీపీటీ స్టీమ్‌ రైస్‌ రూ.52, బీపీటీ ముడిబియ్యం రూ.50కి విక్రయించేలా పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు గత నెల 3న జిల్లాలో 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాలను నేరుగా మిల్లుల వద్దే ఏర్పాటు చేయగా ఆ విషయం తెలియని జనాలు అక్కడ కొనుగోళ్లు చేయడమే లేదు. ఇక రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్‌పురం, ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులోని వై.జంక్షన్‌, గణేష్‌ చౌక్‌, క్వారీ జంక్షన్‌, ఆర్యాపురం, శంభూనగర్‌, నటరాజ్‌ సెంటర్‌, మండపేటలోని రైతుబజార్లలో సన్నబియ్యం కొనుగోలు కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటికి కొందరు మిల్లర్లను అనుసంధానించి బియ్యం సరఫరా చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఆ మిల్లర్లు సరఫరా చేసినప్పుడు ఇక్కడ విక్రయించడం, లేని రోజు దుకాణాలు మూసేసే పరిస్థితి నెలకొంది. ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించకపోవడంతో కొనుక్కుందామనుకునే సామాన్యులకు సన్నబియ్యం దొరకడం లేదు.

ప్రారంభంలో 10 కిలోల సీలింగ్‌

పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఎక్కువ మంది బీపీటీ స్టీమ్‌ రైస్‌ కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కౌంటర్లు ఏర్పాటు చేసిన ప్రారంభంలో అధికారులు సీలింగ్‌ విధించారు. రేషన్‌, ఆధార్‌ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి రూ.10 కిలోలు మాత్రమే ఇచ్చేవారు. ఓ చిన్న కుటుంబం నెలకు 25 కిలోల వరకూ బియ్యం వినియోగిస్తుంది. దీంతో అటువంటి వారు ఇక్కడ పది కిలోలు కొనుగోలు చేసి, మిగిలినవి బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయలేక కౌంటర్ల వద్దకు రావడం మానేశారు. కొద్ది రోజుల నుంచి అధికారులు సీలింగ్‌ ఎత్తేసి ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున విక్రయిస్తున్నా ఈ విషయం జనానికి తెలియడం లేదు. ఇదే అదునుగా కొంత మంది కిరాణా దుకాణదారులు తమకు తెలిసిన వారి ఆధార్‌, రేషన్‌కార్డులు తీసుకొచ్చి నాలుగైదు బస్తాలు తీసుకెళ్లిపోతున్నారు. వాటిని విడిగా మళ్లీ కిలో రూ.70 లెక్కన విక్రయిస్తుండడం గమనార్హం.

ప్రచారం చేయక..

జిల్లా వ్యాప్తంగా 1,018 మంది రేషన్‌ డీలర్ల పరిధిలో 6.58 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. అయితే జిల్లాలో గొప్పగా ప్రారంభించిన బియ్యం కౌంటర్లలో ఇప్పటి వరకూ 12,150 మంది కార్డుదారులకే ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అంటే మొత్తం కార్డుదారుల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే కౌంటర్లలో బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేంద్రాలున్న విషయం జిల్లాలోని 95 శాతం మంది కార్డుదారులకు తెలియదు. పూర్తిస్థాయిలో ప్రచారం చేయకపోవడమే దీనికి కారణం.

పర్యవేక్షణ కరువై..

మొదట్లో ఆర్భాటం చేసినప్పటికీ క్రమంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విక్రయాలు అటకెక్కాయి. మరోవైపు కేంద్రాలు తెరిచినప్పటి నుంచి నేటి వరకూ 12,150 మంది రైస్‌కార్డుదారులకు 157 మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రైతుబజార్లలో బియ్యం అందుబాటులో ఉన్నాయా, ఎన్ని కేంద్రాల్లో విక్రయాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ స్టాక్‌ కొరత ఉంది, సరఫరా ఎందుకు నిలిచింది అనే అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. మిల్లర్లు సమయానికి బియ్యం సరఫరా చేయకున్నా అడిగేవారు లేకపోవడంతో కేంద్రాలు దిష్టిబొమ్మాలా దర్శనమిస్తున్నాయి.

ముద్దగా మారిపోయి..

కౌంటర్‌లో సన్నబియ్యం విక్రయించడం లేదని, బీపీటీ ముడిబియ్యం తీసుకువెళితే వంట చేసేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ముద్దగా మారిపోతోంది అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతుబజార్లలోని కౌంటర్లలో బీపీటీ ముడి బియ్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఇష్టపడడం లేదని నిర్వాహకులే చెబుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చిన ఈ రకం బియ్యం అలానే స్టాక్‌ ఉండిపోతున్నాయి. మరోవైపు ఎక్కువ మంది కొనుగోలు చేసే సన్న బియ్యాన్ని మిల్లర్లు ఈ కేంద్రాలకు సరిపడా సరఫరా చేయడం లేదు.

సన్నబియ్యం ధరకు రెక్కలు

జిల్లాలో వేలాది కుటుంబాలు సన్నబియ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ డీలర్లు ద్వారా అందించే రేషన్‌ బియ్యాన్ని మెజార్టీ కార్డుదారులు వంటకు వినియోగించడం లేదని సమాచారం. వారందరూ బహిరంగ మార్కెట్‌లోని సన్నబియ్యం కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారు. రెండు, మూడు నెలల క్రితం వరకు మేలు రకం సన్నబియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య లభించేవి. ప్రస్తుతం కొన్ని రకాల సన్నబియ్యం ధర రూ.70 దాటిపోయింది. అంటే కిలోపై సుమారు రూ.15 నుంచి రూ.20 వరకు అదనపు భారం పడుతోంది. నెలకు 25 నుంచి 30 కిలోల బియ్యం కొనుగోలు చేసే కుటుంబానికి రూ.500 వరకూ అదనపు ఖర్చుగా మారుతోంది. మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మకై ్కన చంద్రబాబు సర్కారు ధరలు కట్టడి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లోని బియ్యం నిల్వలన్నీ గతేడాది సాగు చేసినవే అయినప్పటికీ ధరలు భారీగా పెంచేశారని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement