మెటల్‌, ఇసుక లారీల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

మెటల్‌, ఇసుక లారీల సీజ్‌

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

అల్లవరం: మండలంలోని కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతం నుంచి ఎలాంటి రికార్డులు, బిల్లులు లేకుండా సముద్రపు ఇసుకను తరలిస్తున్న మూడు ఇసుక లారీలు, మెటల్‌ లోడుతో(బండరాళ్లు) ఉన్న రెండు లారీలను సీజ్‌ చేసినట్టు జిల్లా మైనింగ్‌ అధికారి అశోక్‌ మంగళవారం తెలిపారు. వివర్లాలోకి వెళితే.. ఓడలరేవు తీరంలో గ్రోయిన్స్‌ నిర్మాణాలకు తరలిస్తున్న రెండు మెటల్‌ లోడు లారీలతో పాటుగా, కొమరగిరిపట్నం తీరం నుంచి అక్రమ ఇసుక తరలిస్తుండగా మైన్స్‌ అధికారులు రాత్రి పది గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. అయితే లారీల డ్రైవర్లుఽ అధికారుల కన్నుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మైన్స్‌ అధికారులు ఆ లారీల వెంట పడి వాటిని అల్లవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. రాత్రి పది గంటలకు వేట ప్రారంభిస్తే తెల్లవారుజాము 3 గంటలకు లారీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక తరలిస్తున్న లారీలకు రికార్డులు, బిల్లులు లేవని, ఏ పాయింట్‌ నుంచి ఇసుక వస్తుందో గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని అశోక్‌ తెలిపారు. జిల్లా మైనింగ్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు అక్రమ ఇసుకపై పెనాల్టీ విధించడం జరిగిందన్నారు.

రూ.4.50 లక్షలు పలికిన గణేష్‌ లడ్డూ

రాజోలు: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి చేతులో ఉంచిన 26 కేజీల లడ్డూకు వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.4,50,100 పలికింది. వివరాల్లోకి వెళితే.. రాజోలు కోళ్ల వారి వీధిలో వనువులమ్మ, కనకదుర్గమ్మ యూత్‌ ఆధ్వర్యంలో భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి చేతిలో 26 కేజీల ఆదా లడ్డూను ఉంచి పూజలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో లడ్డూకు వేలంపాట నిర్వహించగా అదే ప్రాంతానికి చెందిన యెరుబండి గణేష్‌ రూ.4,50,100కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఏటా తమ కుటుంబ సభ్యులు లడ్డూను దక్కించుకుంటున్నారని, ఈసారి కూడా తమకే రావడం సంతోషంగా ఉందని గణేష్‌ అన్నారు. అలాగే గణనాథుడి మెడలో రూ.రెండు వేల విలువైన రూ.20 నోట్ల దండను రూ.32 వేలకు కటికిరెడ్డి శ్రీలక్ష్మి, రూ.10, రూ.5 నాణేల దండను దాసరి బాలాజీ రూ. 27 వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement