అమలాపురం రూరల్: రోజూ మాదిరిగానే కూలి పని ముగించుకుని అతడు ఇంటికి తిరుగుపయనమయ్యాడు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకునేవాడే.. అంతలోనే మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చి, అతడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.ఏసుపాదం శుక్రవారం తెలిపిన వివరాలివీ.. అమలాపురం మండలం నడిపూడి శ్రీరామ్ నగర్‌కు చెందిన కొల్లాటి సూరిబాబు (39) అమలాపురం మార్కెట్లో హోల్‌సేల్ ఉల్లిపాయల వ్యాపారి వద్ద రోజువారీ వేతనానికి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పని ముగించుకుని రోజూలానే మోటార్ సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. ముక్కామల బైపాస్ రోడ్డులో వెళ్తూండగా ఈదరపల్లి అయ్యప్ప స్వామి ఆలయ సమీపాన ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు అతడి బైక్‌ను బలంగా ఢీకొంది. తలకు తీవ్ర గాయమైన సూరిబాబును హుటాహుటిన 108లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సత్యవతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సూరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సూరిబాబు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నడిపూడి గ్రామస్తులు, అమలాపురం మార్కెట్లోని వ్యాపారులు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని డిమాండ్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది.
గంజాయి వల్లేనా!
నడిపూడి – ఈదరపల్లిలో కాలువ గట్టున కొంత మంది గంజాయి అమ్ముతున్నారని గ్రామస్తులు చె బుతున్నారు. దీంతో, కొంత మంది యువకులు గంజాయి, మద్యం తాగి, ఆ మత్తులోనే సూరిబాబు బైక్‌ను కారుతో ఢీకొట్టారని ఆరోపించారు. గంజా యిని అరికట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ఫ కారు ఢీకొని రోజు కూలీ మృతి
ఫ ఈదరపల్లి వద్ద ప్రమాదం


