కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రాజమహేంద్రవరం, కాకినాడల్లో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ట్రమడాల్, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. డ్రగ్స్ ఏడీ నాగమణి, రాజమహేంద్రవరం, కాకినాడ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు కల్యాణి, మురళి ఆయా ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. పలు హోల్‌సేల్ దుకాణాల్లో ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించిన బిల్లులు లభించలేదు. వాటిని అమ్మిన రిటైల్ మందుల దుకాణానికి సంబంధించిన బిల్లులు తనిఖీ చేయనున్నారు.
బాలిక ఆత్మహత్య
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలమూరు అరుంధతిపేటకు చెందిన బాలిక చిర్రా బ్లెస్సీ (17) శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. ఇంటర్ వరకూ చదువుకుని, ఇంట్లోనే ఉంటున్న బ్లెస్సీ ఏడాది క్రితం నాయనమ్మతో గొడవ పడి ఆవులకు పెట్టే మందు తాగేసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. నెల రోజుల క్రితం కిడ్నీ నొప్పితో బాధ పడుతూంటే కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. గురువారం మరోసారి నొప్పి వస్తోందనడంతో మెడికల్ షాపు నుంచి టాబ్లెట్ తీసుకువచ్చి వేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటిలానే ఉదయమే రోజువారీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తున్న ఆమె తండ్రి చిర్రా దానియేలుకు తెలిసిన వ్యక్తి ఎదురొచ్చి బ్లెస్సీ ఉరి వేసుకుందని చెప్పాడు. పరుగున వెళ్లిన తండ్రి.. కుమార్తెను వెంటనే కిందకు దింపి, సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే, ఆ బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దానియేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


