● కూటమి పాలనతో ప్రజలు సతమతం
● పోరుబాటలో వివిధ వర్గాలు
కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అలవిగాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చారు. రెండేళ్లకు పైబడిన పాలనలో చాలా హామీలు అమలు చేయలేకపోయారు. కొన్నింటిని ఉద్దేశపూర్వకంగానే బుట్టదాఖలు చేశారు. పైగా, రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతూ కూటమి నేతలు అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇసుక, గ్రావెల్, మద్యం మాఫియాగా అవతారమెత్తి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. గంజాయి మత్తు పల్లెపల్లెలకూ విస్తరిస్తోంది. మహిళలు, బాలికలపై అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా మోసాలు, అక్రమాలు, అరాచకత్వం ప్రబలుతూండటంతో జనం తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం తమను వంచించిందనే విషయం గ్రహించిన వివిధ వర్గాల ప్రజలు ఆగ్రహంతో పిడికిళ్లు బిగించి, పోరుబాట పడుతున్నారు. కొద్ది నెలలుగా జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
● రెండేళ్లుగా ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్నదాతలను దళారులకు వదిలేసింది. అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సైతం సకాలంలో డబ్బులు చెల్లించకుండా రైతులకు చుక్కలు చూపించింది. దీనిపై వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన చంద్రబాబు సర్కారు.. ప్రీమియం భారాన్ని రైతుల పైనే మోపింది. జిల్లావ్యాప్తంగా 12,500 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. ఎకరాకు రూ.5 వేల ప్రీమియం భారాన్ని ఉద్యాన రైతులపై ప్రభుత్వం మోపింది. అంత భారాన్ని మోయలేక కేవలం 500 ఎకరాలకే పంటల బీమా ప్రీమియం చెల్లించారంటే రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
● తెలంగాణ ప్రభుత్వం తరహాలో బీఓసీ బోర్డు ద్వారా సంక్షేమ ఫలితాలు అందించాలని, ప్రమాద మరణాలకు రూ.25 లక్షలు, సహజ మరణాలకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించేలా పథకాలు తీసుకురావాలని అసంఘటిత రంగ కార్మికులు చాన్నాళ్లుగా ఉద్యమిస్తున్నారు. వారి విన్నపాలను చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.
● గత మార్చి నెలలో విజయవాడలో అంగన్‌వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరశన దీక్షను చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా భగ్నం చేసింది. ఆ ఘటనలో జిల్లాకు చెందిన అంగన్‌వాడీ సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.
● తమ గౌరవ వేతనాలను రూ.26 వేలకు పెంచాలని కోరుతూ అంగన్‌వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లు జూలై 31న రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
● ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద గత నెల 5న ఏబీవీపీ ఆధ్వర్యాన విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
● డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ గత నెలలో వైఎస్సార్ సీపీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యాన దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమించారు.
● తమ ఉపాధిని దెబ్బ తీసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓలను రద్దు చేయాలనే డిమాండుతో గత నెల 20 నుంచి 31వ తేదీ వరకూ దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు పెన్‌డౌన్ పేరుతో నిరసన తెలిపారు.
● తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 1న రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
● తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 3న ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్స్ డే పేరుతో రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
సామాన్యులకు ఏ మేలూ లేదు
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు 2024 ఎన్నికల ప్రచారంలో ఆకర్షణీయమైన మాటలతో ప్రజలకు అనేక హామీలిచ్చారు. రెండేళ్ల పాలనలో వాటిని ఏమాత్రం అమలు చేయలేదు. సామాన్య ప్రజల జీవితాలకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం మేలు చేయడం లేదు.
– టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి,
రాజమహేంద్రవరం


