● శాంతిభద్రతలు నిర్వీర్యం
● ప్రజాస్వామ్యం అపహాస్యం
● బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుది
● వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుడారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి, దహనం చేశారన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానని మాదిగ యువకుడు పురుపోగు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్ధినిని కారుతో ఢీకొట్టి చంపేశారన్నారు. ఓ కుటుంబం మొత్తం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం చూస్తూంటే రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా తయారైందన్నారు. చంద్రబాబు అండతో ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారని, దీనిపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజశేఖర్ విమర్శించారు.
ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమా వాలి యాదవ్ మాట్లాడుతూ మహిళలను వివస్త్రల్ని చేయడం, దాడులు చేయడం రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేసినా చెల్లిపోతుందనే అధికార అహంకారంతో ప్రజాప్రతినిధులు, పోలీసులు వ్యవరిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. ఇంత అరాచకాలు జరుగుతూంటే మహిళ అయి ఉండి కూడా హోం మంత్రి అనిత ఖండించకపోగా వ్యంగంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కళ్ల ముందు ఇన్ని అరాచాకాలు జరుగుతూంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరిగే వరకూ నిద్రపోనని చెప్పి, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మందికి పైగా అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారని, అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్ కల్యాణ్‌కే తెలియాలని అన్నారు. విలేకర్ల సమావేశంలో ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరమల్లు లక్ష్మీనారాయణ, బేతపూడి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శులు పావని కుమారి, ప్రేమ్‌బాబు, కృష్ణవేణి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.
నేడు రౌండ్ టేబుల్ సమావేశం
‘చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అనే అంశంపై రాజమహేంద్రవరం రెడ్డీస్ కన్వెషన్ సెంటర్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని రాజశేఖర్ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు దీనికి హాజరు కానున్నారని చెప్పారు.


