టీడీపీ నాయకుల సెటిల్‌మెంట్‌ దందా | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల సెటిల్‌మెంట్‌ దందా

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

వారితో కలసి

ఎస్సై వేధిస్తున్నారని యువకుడి ఆరోపణ

పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో విడుదల

అనపర్తి: ఒక కేసు సెటిల్‌మెంట్‌లో అదనపు డబ్బులు ఇవ్వాలంటూ టీడీపీ నాయకులతో కలసి స్థానిక ఎస్సై వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. అనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు మిత్తన వెంకటేష్‌ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు అతడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటేష్‌ అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి సోదరుడు రాజేష్‌ కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన బియ్యం వ్యాపారి విజయ్‌ అగర్వాల్‌ వద్ద వెంకటేష్‌ గుమస్తాగా పని చేస్తున్నాడు. అనపర్తి, మండపేట పరిసర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులకు బియ్యం లోడ్‌లు సరఫరా చేస్తూంటాడు. కొద్ది రోజుల క్రితం ఒక లారీ లోడుకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల నగదును వెంకటేష్‌, అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అధికారి వీరబాబు కలసి వాడుకున్నారు. ఈ విషయం యజమానికి తెలియడంతో భయపడిన వెంకటేష్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అనపర్తి ఎస్సై బి.వినయ్‌ ప్రతాప్‌ సమక్షంలో వెంకటేష్‌ అన్న రాజేష్‌ రూ.6 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆ డబ్బులు అగర్వాల్‌కు చెల్లించి సమస్య పరిష్కరించుకున్నట్టు రాజేష్‌ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామానికి వచ్చిన వెంకటేష్‌ను మిగిలిన రూ.4 లక్షలు చెల్లించాలంటూ అధికారి వీరబాబుతో పాటు మరో టీడీపీ నేత అధికారి దొరబాబు కలిసి ఎస్సై ద్వారా ఒత్తిడి తెచ్చారు. నాలుగు రోజులుగా తన తమ్ముడిని ఎస్సై వినయ్‌ ప్రతాప్‌ విపరీతంగా వేధించారని వెంకటేష్‌ అన్న రాజేష్‌ ఆరోపిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా తీవ్రంగా కొట్టారని, ఆ టార్చర్‌ తట్టుకోలేక వెంకటేష్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆత్మహత్యా యత్నానికి ముందు వెంకటేష్‌ సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. తన మరణానికి పులగుర్త గ్రామానికి చెందిన నా యకులు దొరబాబు, వీరబాబు, అనపర్తి ఎస్సై వేధింపులే కారణమని ఆ వీడియోలో పేర్కొన్నాడు. వారి బారి నుంచి తన తమ్ముడికి, కుటుంబానికి రక్షణ కల్పించాలని వెంకటేష్‌ సోదరుడు రాజేష్‌ ఉన్నతాధికారులను కోరుతున్నాడు.

విచారణ నుంచి తప్పించుకునేందుకే..

వెంకటేష్‌ ఆరోపణలపై స్థానిక ఎస్సై బి.వినయ్‌ ప్రతాప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అతడిపై అనపర్తి స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసులో విచారణకు పిలవగా తప్పించుకునేందుకే ఇలా చేశాడని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement