మంచిది కాదేమో మచ్చ | - | Sakshi
Sakshi News home page

మంచిది కాదేమో మచ్చ

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

కుష్ఠు నియంత్రణకు కేంద్రం కృషి

వచ్చే మార్చి నాటికి నిర్మూలనే ధ్యేయం

నేటి నుంచి 24 వరకూ అవగాహన కార్యక్రమాలు

కపిలేశ్వరపురం: శరీరంపై ఏవైనా మచ్చలు వస్తే అలా వదిలేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఒక్కోసారి అది కుష్ఠుకు సంబంధించినది కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు, కుష్ఠు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పారా మెడికల్‌ ఆఫీసర్‌, పీహెచ్‌సీలోని ఎంపీహెచ్‌ఎస్‌ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం చేపడతారు. వైద్య, ఆరోగ్య కార్యకర్తలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాధి లక్షణాలను వివరిస్తున్నారు. వాటి ఆధారంగా అనుమానితులు స్థానిక పీహెచ్‌సీ వైద్యులను లేదా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించవచ్చు. వారిని డీపీఎంఓ స్థాయి అధికారి షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. లక్షణాలున్న వారికి వ్యాధి సోకిందో లేదో ప్రత్యేక బృందం నిర్ధారిస్తుంది. నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, చికిత్స చేస్తారు. గత నెలలో జరిగిన క్షేత్ర స్థాయి పరిశీలనలో తొమ్మిది మందికి వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించి, బహుళ ఔషధ చికిత్స అందించారు. వారిలో ఎనిమిది మందికి వ్యాధి నయమైంది. జిల్లాలో ఐదు మచ్చల్లోపు ఉన్న కేసులు 11, అంతకంటే ఎక్కువ మచ్చలున్న కేసులు 69 కొత్తగా నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా అంగవైకల్యం పొందిన వారు జిల్లాలో 916 మంది ఉన్నారు. వారిలో గ్రేడ్‌–1 వైకల్యంతో 92 మంది, గ్రేడ్‌–2 వైకల్యంతో 824 మంది బాధ పడుతున్నారు. జిల్లాలోని 11 లెప్రసీ కాలనీల్లో 119 మంది నివాసం ఉంటున్నారు.

లక్షణాలను బట్టి బహుళ ఔషధ చికిత్స

మానసికంగా ధైర్యంగా ఉండటం కుష్ఠు వ్యాధి నయం కావడానికి దోహదపడుతుంది. ఈ వ్యాధిని నయం చేయడానికి ఆధునిక చికిత్సా పద్ధతులున్నాయి. శరీరంపై రాగి రంగు మచ్చలొస్తాయి. ఆ మచ్చలపై వెంట్రుకలు రాలిపోతాయి. దురద, స్పర్శ, నొప్పి ఉండవు. ఈ ప్రారంభ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆశా, ఏఎన్‌ఎంలకు చెప్పాలి. వ్యాధి నిర్ధారణ అయితే బహుళ ఔషధ చికిత్స అందిస్తారు. పుండ్లు పడిన వారికి అవసరమైతే రిఫరల్‌ లెప్రసీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేస్తారు.

– డాక్టర్‌ వసుంధర, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ అండ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అధికారి, రాజమహేంద్రవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement