బీసీల పాలిట తెగులు టీడీపీ | - | Sakshi
Sakshi News home page

బీసీల పాలిట తెగులు టీడీపీ

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

వారిని ఎదగకుండా చేశారు

మాజీ మంత్రి,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు

రాజమహేంద్రవరం రూరల్‌: తెలుగుదేశం పార్టీ బీసీలను ఎదగకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారు కానీ నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, బీసీలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వేణు విమర్శించారు. ఈ తెగులు వల్ల 1997లో ఐటి రంగంలో భూమ్‌ వచ్చినా బీసీలు ఆ రంగంలోకి రాలేక పోయారని ఆయన ధ్వజమెత్తారు. బీసీలను కులవృత్తులుగా పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో వారిని విద్యకు దూరం చేశారని ఆరోపించారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటి రంగంలో ఎదిగారని ఆయన అన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి 34 శాతం రిజర్వేషన్‌ను మించి 40 శాతం వరకు వారికి పదవులు కల్పించేలా చర్యలు చేపట్టి స్థానిక ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్‌ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని 105 జీవో ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పు అధిగమించి హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేసారు. బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి రూ.వెయ్యి కోట్లు మొదటి బడ్జెట్‌లో పెట్టి, కనీసం రూ.వెయ్యి ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్‌లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు ఉన్న బీసీలకు పెన్షన్లు ఏమయ్యాయని వేణు ప్రశ్నించారు. ప్రలోభాలు ఎర వేసి తమ పార్టీలోని బీసీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. వీటన్నింటినీ ఎండగట్టడానికి టీడీపీ వెన్నుపోటు గురించి రీజనల్‌ మీటింగ్స్‌ పెట్టాలని వైఎస్సార్‌ సీపీ నిర్ణయించినట్లు వేణు స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement