ఆ క్షణం ఆగితే పరీక్ష పాస్‌! | - | Sakshi
Sakshi News home page

ఆ క్షణం ఆగితే పరీక్ష పాస్‌!

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

ఒత్తిడిని అధిగమిస్తే విజయం తథ్యం

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు

నేడు ప్రపంచ ఆత్మహత్యల

నిరోధక దినం

మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా కొండంతలా భయపెడుతుంది. సమస్య అనే బరిలో ఉండి దాని పరిష్కారానికి దారులు వెతికితే అంతా అయోమయంగా దారీ తెన్నూ లేకుండా అదే చట్రంలో తిరుగుతుంది మనసు. ఆ చట్రం నుంచి బయటకు వచ్చి సమస్య తనది కాదన్నట్టు పరిశీలిస్తే ఇట్టే దారి దొరుకుతుంది. సమస్య తనది కాదు కాబట్టి ఆ మూడో వ్యక్తి సులభంగా సలహా ఇవ్వగలడు. అలా కాకుండే సమస్యలోనే కొట్టుమిట్టాడుతూ తట్టుకోలేక ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ నెల 10న ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

రాయవరం: సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారిలో ఆత్మహత్య భావనలు ఎక్కువగా ఉంటాయి. యువతలో ఇవి మరీ ఎక్కువ. అందుకు గల కారణాలు పైకి కనిపించేవి కొన్ని, కనపడనివి కొన్ని. ప్రేమ వివాహాలు, ఆర్థిక పరిస్థితులు, మానవ సంబంధాలు తదితరాలతో కొంతమంది, చెప్పలేని కారణాలతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదడులో సెరొటోనిన్‌ అనే రసాయనిక చర్యలు ఆత్మహత్య చేసుకోవడానికై నా, నిగ్రహించుకోవడానికై నా తోడ్పడుతుంది. మనిషి ఆలోచనల తీవ్రతను బట్టి అంతిమ చర్య ఆధారపడి ఉంటుంది. సమస్యకు కారణమైన వ్యక్తి లేదా పరిస్థితులకు ఆ వ్యక్తి తన చర్య ద్వారా తన పరిస్థితిని తెలియజేయాలనుకుంటాడని మానసిక వైద్యులు చెప్తున్నారు.

కౌన్సెలింగ్‌ సెంటర్‌ ద్వారా చికిత్స

జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో మానసిక రుగ్మతలతో బాధపడేవారి కోసం కౌన్సెలింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు కౌన్సెలింగ్‌ పొందుతున్నట్లు ఏరియా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేందుకు ఇష్టపడని వారు టెలిమానస్‌ 14416 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి బేసిక్‌ కౌన్సెలింగ్‌ను పొందే వీలుంది.

పురుషులే అధికం

ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 52.8 శాతం మంది పురుషులైతే, 47.1 శాతం మహిళలు.

కొన్ని సర్వేల ప్రకారం ఆత్మహత్యకు గల కారణాలు, ఏ వయసు వారు

ఎంత శాతం ఉన్నారన్న వివరాలు ఇలా..

కారణం శాతం

దిగులు 33.3

పరీక్షలు, ఒత్తిడి, ప్రేమ విఫలం 10.6

నిద్రలేమి 11.4

భయం, కంగారు 10.6

12 ఏళ్ల లోపు వారు 3.6

13–17 ఏళ్ల లోపు వారు 6.3

18–45 ఏళ్ల లోపు వారు 67.6

46–64 ఏళ్ల లోపు వారు 17.4

65 ఏళ్లు పైబడిన వారు 5.1

‘పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు తన కుటుంబంతో గత నెల 18న రాజమహేంద్రవరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నూకరాజు, అయన భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతి చెందగా, మనవడు కార్తికేయరెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. షేక్‌ సాధిక్‌ ఖాన్‌ నుంచి వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య వైపే నూకరాజు కుటుంబం మొగ్గు చూపింది.’

ఈ నెల 5న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన నంబూరి శ్రీనివాస్‌, ఆయన భార్య పద్మిని, కుమారుడు వీరవెంకట ఈశ్వర్‌, కుమార్తె నిత్యశ్రీ చించినాడ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పద్మిని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వ్యాపారంలో నష్టాలు రావడానికి తోడు అప్పులు తీర్చాలని వ్యాపారుల నుంచి ఒత్తిడి రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని శ్రీనివాస్‌ భావించారు. ఇలా నిత్యం వివిధ సమస్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మానసిక వైద్యుడిని సంప్రదించాలి

సంపాదన కోసం పిల్లలకు దూరం కావడం మంచిది కాదు. పిల్లలు ఏది అడిగితే అతి కొనివ్వడమూ సమర్ధనీయం కాదు. తీవ్రంగా ఆలోచిస్తూ, వేదనకు గురవుతున్న వారిని గుర్తించి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకువెళ్లాలి. తద్వారా సమస్య గుర్తించి చర్యలు తీసుకోవచ్చు.

– డాక్టర్‌ అఖిలేంద్రశ్రీనివాస్‌ ఒగ్గు, సైకియాట్రిస్ట్‌, డిస్ట్రిక్ట్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌, తూర్పుగోదావరి జిల్లా

ప్రతి సమస్యకూ పరిష్కారం

ఎంత సమస్యకై నా పరిష్కారం అన్వేషించాలి. ఆత్మహత్యలకు పాల్పడడం పిరికితనమే. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ఆలోచనలు భిన్నంగా కన్పిస్తాయి.

– బి.విద్య, డీఎస్పీ, ఈస్ట్‌ జోన్‌, రాజమహేంద్రవరం

మార్పు గమనించాలి

ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వ్యక్తి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. అటువంటి వారిపై కన్నేసి ఉంచాలి. వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు మేమున్నామంటూ భరోసా కల్పించాలి.

– డాక్టర్‌ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్‌, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement