ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సారాయి కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై పీడీ చట్టం అమలు చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జోన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వై.చైతన్య మురళి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నార్త్, సౌత్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన వల్లూరి దుర్గారావు (అలియాస్ పెద్ద దుర్గ), రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిటికిన నాగేశ్వరరావులపై కలెక్టర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంతో వారిని అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. సారా తయారీ, విక్రయాల సమాచారం తెలిస్తే 14405 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దిండి వంతెన పైనుంచి దూకి యువకుడి గల్లంతు
మలికిపురం: దిండి వంతెనపై ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఆ గ్రామానికే చెందిన దేవ వికాస్ (25) అనే యువకుడు వంతెన పైనుంచి నదిలో దూకి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. యువకునికి మూడు రోజుల క్రితం వివాహమైందని, వివాహం ఇష్టం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని స్థానికులు అంటున్నారు. కాగా అంతకు ముందే వంతెనపై ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి పరిస్థితిని సమీక్షించి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్ది సేపటికే యువడు తన సెల్ ఫోన్‌ను వంతెనపై వదిలి నదిలో దూకుతుండగా ఆ మార్గంలో కారులో వెళ్తున్న వారు గమనించి అతడిని ఆపే ప్రయత్నం చేశాడు. అంతలోనే దూకేయడంతో వంతెనపై ఉన్న సెల్ ఫోన్ ద్వారా అతడి ఆచూకీని గుర్తించారు.
వ్యక్తి అదృశ్యం
దేవరపల్లి: వ్యక్తి అదృశ్యంపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైయింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సంగరాజుపాలేనికి చెందిన ఆలం మహేష్ ఆవపాడులోని మిల్క్‌డైరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా ఈ నెల 2న ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు, సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీనిపై మహేష్ భార్య ఆలం నాగదుర్గ ఈ నెల 3వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బుధవారం కేసు నమోదు చేసి, అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు.
గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్సై మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గుండెపోటుతో రాజమహేంద్రవరం ట్రాఫిక్ ఏఎస్సై చంద్రశేఖర్ బుధవారం మృతిచెందారు. ఆయన యథావిధిగా విధులు ముగించుకుని అంబికానగర్‌లోకి ఆయన ఇంటికి వెళ్లారు. తర్వాత ఒంట్లో కొంత ఇబ్బందిగా ఉందని భార్యకు చెప్పగా ఆమె మజ్జిగ ఇచ్చారు. అది తాగిన కొంతసేపటికి వెంకటేశ్వరరావు సృహ కోల్పోయారు. వెంటనే ఇంటిలోని వారు 108 ఫోన్ చేయగా వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ 30 ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో ట్రాఫిక్ డీఎస్పీతో పాటు సీఐ అబ్దుల్ నబీ, ఇతర పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.


