● కార్డుదారుల చక్కెర పక్కదారి
● జిల్లాలో 6.58 లక్షల రేషన్ కార్డులు
● వీటిపై 3.26 లక్షల కిలోల పంచదార సరఫరా
● ఈ నెల కేటాయింపు తక్కువని చెబుతూ టోకరా
● ఈ–పోస్ యంత్రంలో గుట్టుగా వేలిముద్రలు
● అనంతరం దళారులకు
అమ్మి సొమ్ము చేసుకుంటున్న డీలర్లు
● పర్యవేక్షించని పౌర సరఫరాల అధికారులు
సాక్షి, రాజమహేంద్రవరం: చౌక దుకాణాల్లో చక్కెర దందా తియ్యగా సాగిపోతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో పంచదార ధర రూ.75కు చేరింది. దీంతో, ఇదే అవకాశంగా పలువురు రేషన్ డీలర్లు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు అందించాల్సిన పంచదారను దారి మళ్లించి, బయట అధిక ధరలకు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు చౌక దుకాణాల్లోనూ అధిక ధరలకు అమ్మేసి కార్డుదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడంతో డీలర్లు చక్కెరను చక్కగా చక్కబెట్టేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,018 రేషన్ షాపుల వాటి పరిధిలో 6.58 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా సుమారు 3.26 లక్షల కిలోల పంచదార సరఫరా చేస్తున్నారు.
యంత్రం నోరు నొక్కి.. కుతంత్రం
రేషన్ డిపోలో కార్డుదారులు బియ్యం, పంచదార, గోధుమ పిండి.. ఇలా ఏది తీసుకున్నా ఈ–పోస్ యంత్రంలో వేలిముద్ర వేయించుకుంటారు. ఆ తర్వాత కార్డుదారులు ఏం తీసుకుంటున్నారనే వాయిస్ మెసేజ్ ఆ యంత్రం ద్వారా వినిపిస్తుంది. కానీ, ఇలా వాయిస్ మెసేజ్ వినిపించనీయకుండా డీలర్లు సెట్టింగ్‌లు మార్చేస్తున్నారు. లబ్ధిదారులు బియ్యం తీసుకున్న సమయంలోనే పంచదార, గోధుమ పిండి తీసుకున్నట్లు వేలిముద్రలు వేయించేసుకుంటున్నారు. దీనివలన ఆ లబ్ధిదారులు సరకులు తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తుంది. కానీ, వాస్తవానికి కార్డుదారులకు మాత్రం ఆ సరకులు అందడం లేదు.
కార్డుదారులకు అమ్మినా దోపిడీయే..
నిబంధనల ప్రకారం కార్డుదారులకు అర కిలో పంచదారను రూ.17కే విక్రయించాలి. అయితే, అవగాహన లేని వారి నుంచి చాలా మంది డీలర్లు రూ.20, అంతకు మించే వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చిల్లర లేదని చెప్పేస్తున్నారు. ఒక్కో కిలోకు రూ.3 చొప్పున టన్నుకు రూ.3 వేల వరకూ దోచేస్తున్నారు. రాజానగరం, అనపర్తి, నిడదవోలు నియోజకవర్గాల్లోని కొన్ని డిపోల్లోనైతే ఈ నెల ఆరంభంలో వెళ్లిన వారికి కూడా.. ‘పంచదార తక్కువగా వచ్చింది. వచ్చిన సరకు అయిపోయింది’ అని చెప్పి, వేలిముద్రలు తీసుకుని పంపించేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మొత్తం అన్ని రకాల కార్డుదారులకు మస్కా కొట్టి సుమారు 2 లక్షల కిలోల పంచదార పక్కదారి పట్టించి, దాదాపు రూ.కోటి పైగానే దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొదటి వారంలోనే స్టాక్ నిల్
కొన్ని రేషన్ షాపుల పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంటోంది. మొదటి వారంలోనే స్టాక్ అయిపోయిందంటూ బోర్డు పెట్టేసి, షాపులు మూసేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలు సహా అన్ని రోజుల్లోనూ రేషన్ షాపుల ద్వారా సరకులు ఇవ్వాలి. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకూ దుకాణాలు తెరచి ఉంచాలి. కానీ, జిల్లాలోని అనేక రేషన్ షాపులను ప్రతి నెలా 5 లేదా 7వ తేదీ నాటికే మూసివేస్తున్నారు. రాజమహేంద్రవరం స్వరూప్ నగర్, లాలాచెరువు తదితర ప్రాంతాల్లో రెండు నెలలుగా స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టేసి, డీలర్లు పత్తా లేకుండా పోతున్నారు. దీంతో, ఆయా షాపులకు వెళ్తున్న కార్డుదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరో దుకాణానికి వెళ్తున్నా.. అక్కడ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు.
అంత్యోదయ చూపడం లేదు
మరోవైపు జిల్లాలో 22,259 అంత్యోదయ అన్న యోజన కార్డులున్నాయి. ఎక్కువగా ఇవి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు కిలో చొప్పున పంచదార రూ.13.50కే ఇవ్వాలి. కానీ, వీరిలో 70 శాతం మందికి పంచదార ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా డీలర్లు నమోదు చేస్తున్నారు. ఈ లెక్కన 15 వేల కిలోలు పక్కదారి పట్టిస్తూ, దీనిని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని, సుమారు రూ.10 లక్షల మేర సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కార్డుదారులకు కేవలం 35 కిలోల బియ్యమే ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెలా కిలో చొప్పున పంచదార కూడా ఇస్తున్నట్లు ఈ–పోస్ యంత్రాల్లో వేలిముద్రలు వేయించుకుంటున్నారు. కనీసం అర కిలో కూడా ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాలపై పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే డీలర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా సక్రమంగా పర్యవేక్షించి డీలర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి, న్యాయం చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.


