అమలాపురం టౌన్: కోనసీమలో 25 ఏళ్ల కిందట చేపట్టిన రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని నిరసిస్తూ కోనసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో మంగళవారం ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు రెండేళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి కోనసీమకు వచ్చి రైల్వే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వస్తున్న క్రమంలో కోనసీమ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఓ విధాన ప్రకటన చేయాలని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామమోహనరావు విజ్ఙప్తి చేశారు. అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వద్ద, అయినవిల్లిలో, ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై జేఏసీ ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు చేశారు. జేఏసీ ప్రతినిధులు కరాటం నరసింహారావు, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, గంధం శ్రీరామచంద్రమూర్తి, నూకల శ్రీనివాస్, సఖిలే వెంకటేశ్వరరావు, కరాటం ప్రవీణ్, జంగా రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


