పెరవలి: వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) పథకం తెలుగు తమ్ముళ్లలకు కాసులు కురిపిస్తోంది. పెరవలి మండలం ఖండవల్లి పోలేరమ్మ చెరువులో జరుగుతున్న అక్రమాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఖండవల్లిలో ఉపాధి హామీ పనులేవీ జరగకపోవడంతో.. ఈ ఏడాది పనులు చేయకపోతే వచ్చే సంవత్సరం పనులకు అనుమతులు ఉండవని కూటమి నాయకులకు అధికారులు చెప్పారు. దీంతో, స్థానిక పోలేరమ్మ చెరువు తవ్వడానికి అధికారులను కూటమి నేతలు ఒప్పించారు. ఈ మేరకు అధికారులు అంచనా వేసి, రూ.8 లక్షలు మంజూరు చేశారు. వీబీ జీ రామ్ జీ నిబంధనల ప్రకారం కూలీలతో పనులు ప్రారంభించారు. చెరువు చుట్టూ తుప్పలను నరికించి, వేతనాలుగా వారికి రూ.10 వేలు చెల్లించారు. ఇక్కడే కూటమి నేతలు కొత్త పన్నాగానికి తెర లేపారు. చెరువు చుట్టూ ఉన్న తుప్పల్లో పాములుంటాయని, అందువలన కూలీలతో కాకుండా యంత్రాలతో వాటిని తొలగించాలని, ఆ తరువాత తవ్వకాలు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అనంతరం, తుప్పలు తొలగించే పేరుతో పొక్లెయిన్‌తో చెరువుకు తూట్లు పొడిచారు. ఆ మట్టిని ట్రాక్టర్లతో రేయింబవళ్లు యథేచ్ఛగా తరలించారు. లే అవుట్లకు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి సుమారు 800 ట్రాక్టర్ల మట్టిని అమ్ముకున్నారు. ట్రాక్టర్‌కు రూ.800 చొప్పున మొత్తం రూ.6.40 లక్షల మేర దండుకున్నారు. అనంతరం, చెరువు తవ్వేశామని, బిల్లు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పనికి బిల్లు చేస్తే తమ పీకల మీదకు వస్తుందని భయపడుతున్న అధికారులు అటు కూటమి నాయకులకు చెప్పలేక, ఇటు కూలీలకు పనులు కల్పించలేక సతమతమవుతున్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన నేతలే ఇలా అక్రమాలకు పాల్పడటమేమిటని ఖండవల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వీబీ జీ రామ్ జీ టెక్నికల్ అసిస్టెంట్ పి.వెంకన్నబాబును వివరణ కోరగా.. కూలీలతో తుప్పలు తొలగించటానికి రూ.10 వేలు మంజూరు చేశామని, యంత్రాలతో చెరువు తవ్వకాలు చేసినట్లు తమ దృష్టికి రావడంతో బిల్లు నిలుపు చేశామని చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా
యంత్రంతో చెరువు తవ్వకాలు
రూ.6.50 లక్షల విలువైన
మట్టి కొల్లగొట్టిన అక్రమార్కులు
బిల్లు చేయాలంటూ ఒత్తిళ్లు
ససేమిరా అంటున్న అధికారులు


