డిపాజిట్లు చెల్లించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్లు చెల్లించాల్సిందే..

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదు

వృద్ధుడి దీక్షకు డిపాజిట్‌దారుల మద్దతు

రూ.4.40 కోట్ల దుర్వినియోగంపై చర్యలు శూన్యమని ఆవేదన

నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం సొసైటీలో తాము చేసిన డిపాజిట్ల సొమ్ము తిరిగి చెల్లించేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని పలువురు డిపాజిట్‌దారులు స్పష్టం చేశారు. ఇదే డిమాండుతో 75 ఏళ్ల వృద్ధుడు చిట్టూరి నరసింహమూర్తి చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఆయనకు మద్దతుగా మిగిలిన డిపాజిట్‌దారులు కూడా దీక్షలో పాల్గొన్నారు. తమ సొమ్ము తిరిగి చెల్లించేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. నరసింహమూర్తి సోమవారం రాత్రి సొసైటీలోనే బస చేయడంతో.. కొవ్వూరులోని సొసైటీ డివిజన్‌ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు రాత్రి 11 గంటల సమయంలో సూర్యారావుపాలెం చేరుకుని, ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, రాత్రి వేళ చర్చలు అవసరం లేదని, ఉదయం డిపాజిట్‌దారులందరూ వస్తారని, వారి సమక్షంలోనే చర్చించి, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నరసింహమూర్తి సూచించినట్లు సమాచారం. అదే సమయంలో స్థానిక మంత్రి కందుల దుర్గేష్‌ ఫోనులో నరసింహమూర్తితో మాట్లాడారని డిపాజిట్‌దారులు తెలిపారు. సొసైటీలో ప్రస్తుతం ఉన్న సుమారు రూ.92 లక్షల నగదు నిల్వలను రెండు మూడు రోజుల్లోగా డిపాజిట్‌దారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. సొసైటీలో రూ.4.40 కోట్ల దుర్వినియోగమైనట్లు నిర్ధారణ జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని డిపాజిట్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్‌ సొమ్ముల కోసం ఏడేళ్లుగా పలుమార్లు ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిసారీ అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలివ్వడం, ఆ తర్వాత చెల్లింపులు జరగకపోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈసారి మాత్రం డిపాజిట్‌ సొమ్ము పూర్తిగా చెల్లించడంతో పాటు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement