నల్ల మాస్కులతో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

నల్ల మాస్కులతో ఆందోళన

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

అనపర్తి: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలో భాగంగా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నల్ల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు నెలలుగా వివిధ రూపాల్లో వారు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులర్‌ చేయాలని, అప్పటి వరకూ 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రేడియోగ్రాఫర్‌ విజయ కుమార్‌, కౌన్సిలర్‌ చైతన్యరాజు, బయో మెడికల్‌ ఇంజినీర్‌ వినోద్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రాంతి, ఫార్మసిస్ట్‌ మీనా, నర్సింగ్‌ ఆఫీసర్లు అమ్మాజీ, రామలక్ష్మి, స్వాతి, నాగమణి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

బాలికను కాపాడిన శక్తి టీమ్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సోషల్‌ మీడియా మోజులో పడి ఓ యువకుడిని కలిసేందుకు వచ్చిన బాలికను శక్తి టీమ్‌ సభ్యులు గుర్తించి కాపాడారు. వివరాలివీ.. రాజమహేంద్రవరం కంబాల చెరువు పార్కు వద్ద మహిళా పోలీస్‌ స్టేషన్‌ శక్తి టీమ్‌ సభ్యులు మంగళవారం గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడితో ఉన్న బాలికను గుర్తించి, విచారించారు. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయమైన ఆ యువకుడిని కలిసేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా విజయవాడ నుంచి వచ్చానని ఆ బాలిక చెప్పింది. వెంటనే శక్తి టీమ్‌ సభ్యులు అప్రమత్తమయ్యారు. ఆ బాలికతో పాటు యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించి, స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. అక్కడ కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల విషయంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, సోషల్‌ మీడియా పరిచయాలను పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు. బాలికను సకాలంలో గుర్తించి, కాపాడిన రాజమహేంద్రవరం మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ డి.శ్రీహరిరాజు, ఇన్‌స్పెక్టర్‌ మంగాదేవి, ఎస్సై షేక్‌ అమీనా బేగం, శక్తి టీమ్‌ సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ అభినందించారు.

కూచిపూడి నృత్యంపై

వచ్చే నెలలో వర్క్‌షాప్‌

రాజమహేంద్రవరం రూరల్‌: రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న కూచిపూడి నృత్యానికి యునెస్కో అపురూప సాంస్కృతిక వారసత్వ గుర్తింపు కోసం వచ్చే నెల 6, 7 తేదీల్లో డాక్యుమెంటేషన్‌, కూచిపూడి వారసత్వ ప్రోత్సాహంపై జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తెలుగు విశ్వ విద్యాలయం, కృష్ణా జిల్లా కలెక్టరేట్‌, రాష్ట్ర యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖల సౌజన్యంతో కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో పాల్గొనడానికి కూచిపూడి నృత్యంలో స్నాతకోత్తర డిగ్రీ చేస్తున్న వారు, పూర్తి చేసిన వారు, పరిశోధక విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుయూనివర్సిటీఏపీ.ఇన్‌లో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు పూర్తి చేసి పంపించాలని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై వినతి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ప్రతినిధులు మంగళవారం కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ను కలిసి విన్నవించారు. కలెక్టర్‌తో పాటు జేసీ అపూర్వ భరత్‌ను కూడా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.చంద్రశేఖర్‌రెడ్డి, సాధనాల రామ్మోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement