సర్వర్‌ సమస్యలమయం | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ సమస్యలమయం

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

కొత్త పింఛన్లకు సర్వర్‌ కష్టాలు

అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు

పలుచోట్ల జనరేట్‌ కాని ఓటీపీ

విద్యుత్‌ మీటర్లు ఎక్కువగా

ఉన్నాయంటూ షాక్‌ ఇస్తున్న పోర్టల్‌

రాజమహేంద్రవరం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెర తీసింది. రెండేళ్లకు పైగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు ఇవ్వకుండా ముఖం చాటేసి సర్కారు.. ఇప్పుడు ఉన్నట్టుండి కొత్త పింఛన్లు ఇస్తామంటూ హడావుడి మొదలు పెట్టింది. దీని కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే, దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. అందు లోనూ 12వ తేదీ రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండగ సందర్భంగా సెలవులు వచ్చాయి. దీంతో, ఇక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఆదరాబాదరాగా గ్రామ, వార్డు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడకు వెళ్తే సర్వర్‌ సరిగ్గా పని చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు, నిబంధనలు వారికి ప్రతిబంధకంగా మారుతున్నాయి.

స్పష్టత కరువు

కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప.. వీటిని ఎప్పటి నుంచి, ఎంత మందికి ఇస్తారనే అంశంపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఈవిధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవేళ స్థానిక ఎన్నికల్లోగా ఇవ్వకపోతే.. ఆ తరువాత నిజంగా కొత్త పింఛన్లు ఇస్తారా.. లేక ఈ దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తారా అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అనేక కారణాలను వారు చూపిస్తున్నారు. గతంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అధికారం ఎంపీడీఓలకే ఉండేది. ప్రస్తుతం వారి చేతిలో నుంచి ఆ అధికారాన్ని కూటమి ప్రభుత్వం తొలగించింది. కేవలం సిఫారసు చేయడానికి మాత్రమే ఎంపీడీఓలను పరిమితం చేసింది. అలాగే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజంగా కొత్త పింఛన్లు ఇస్తుందా అనే అనుమానాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది.

గుర్తింపు కార్డుల సమస్య

మత్స్యకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు ఇలా విభిన్న వర్గాలకు చెందిన వారు కొత్త పింఛనుకు దరఖాస్తు చేయడానికి సచివాలయాలకు వస్తున్నారు. వారిని అక్కడి సిబ్బంది ఆయా శాఖల నుంచి ఇచ్చిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. గుర్తింపు కార్డు అప్‌లోడ్‌ చేయకపోతే పోర్టల్‌లో అభ్యంతరం వస్తోంది. సాధారణంగా ఇంటి యజమానులుగా ఉండే పురుషుల్లో కొంత మందికే గుర్తింపు కార్డులుంటాయి. మిగిలిన వారు గడువులోగా సంబంధిత శాఖల నుంచి గుర్తింపు కార్డులు తెచ్చుకోవడం కష్టమే.

సర్వర్‌ సమస్య లేదు

జిల్లాలోని సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎటువంటి సర్వర్‌ సమస్యా లేదు. అక్కడక్కడ సాంకేతిక ఇబ్బందులు వలన సర్వర్‌ స్లోగా పని చేసి ఉండవచ్చు. ఏ సచివాలయంలోనైనా సర్వర్‌ సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. – బి.నగేష్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

దరఖాస్తుదారులకు విద్యుత్‌ షాక్‌

దరఖాస్తుదారుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేస్తున్నప్పుడు కొంత మందికి వారి పేరున రెండు మూడు విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో పాటు నెలకు 300 యూనిట్లు లేదా అంతకు మించి విద్యుత్‌ వినియోగం దాటితే పింఛనుకు అనర్హులుగా చూపుతోంది. అప్‌లోడ్‌ చేసే సమయంలో తిరస్కరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులన్నీ సరి చేసుకుని మళ్లీ దరఖాస్తు అప్‌లోడ్‌ చేద్దామంటే సమయం లేని పరిస్థితి. కేవలం ఐదు పని దినాలే మిగిలి ఉన్నాయి. ఇంత తక్కువ రోజుల్లో విద్యుత్‌ మీటర్ల సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యం కాదు. అటువంటప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయాలకు వచ్చాక మీటర్ల విషయం తెలిసి, చాలా మంది దరఖాస్తుదారులు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.

ఓటీపీ రాదు.. సర్వర్‌ పని చేయదు

కొత్త పింఛనుకు దరఖాస్తు చేసేటప్పుడు సర్వర్‌లో అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దరఖాస్తుదారుల వివరాలను తొలి దశలో అప్‌లోడ్‌ చేశాక ఓటీపీ రావాలి. కానీ, జిల్లాలోని అనేక సచివాలయాల్లో రెండు రోజులుగా పూర్తి స్థాయిలో సర్వర్లు పని చేయడం లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వారికి ఓటీపీలు రావడం లేదు. దీంతో, తదుపరి దశకు వెళ్లలేక, ఏం చేయాలో తెలీక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. సర్వర్‌ ఎప్పుడు పని చేస్తుందో తెలియక దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. సర్వర్‌లో వస్తున్న ఇటువంటి లోపాలను సరి చేసుకుని, దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోని పరిస్థితి. ఆలోగా పోర్టల్‌ బంద్‌ అయితే ఇక చేసేదేమీ లేనట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement