ఇంధనదాహం | - | Sakshi
Sakshi News home page

ఇంధనదాహం

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

పంచాయతీ కార్యదర్శుల నిర్వాకం

పారిశుధ్య వాహనాల డీజిల్‌కు

రూ.2.5 కోట్లకు పైగా డ్రా

చిన్న గ్రామాల్లోనూ రూ.లక్షల ఖర్చు

వాహనాలు లేనిచోటా డీజిల్‌

కొనుగోలు చేసినట్లు రికార్డులు

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో

86 మంది కార్యదర్శులకు నోటీసులు

తదుపరి చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు

● రాజానగరం మండలం వెలుగుబందలో డీజిల్‌ కోసం రూ.16,57,984 ఖర్చు చేసినట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి చూపించారు. వాస్తవానికి ఈ గ్రామ జనాభా సుమారు 5 వేలు. ఇక్కడ నాలుగు తోపుడు బళ్లు, రెండు రిక్షాలు మాత్రమే ఉన్నాయి. వీటికి డీజిల్‌ అవసరమే లేదు. అయినప్పటికీ డీజిల్‌ పేరిట ఇంత భారీ ఖర్చు చూపించడం గమనార్హం.

● రాజానగరం మండలం దివాన్‌ చెరువులో డీజిల్‌ కోసం రూ.14,54,928 ఖర్చు చేశామంటూ పంచాయతీ కార్యదర్శి నిధులు డ్రా చేశారు. ఈ గ్రామ జనాభా సుమారు 10 వేలు. ఇక్కడ మూడు వాహనాలున్నాయి. వాటికి డీజిల్‌కు మహా అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకే ఖర్చవుతుంది. అయినప్పటికీ రూ.14.5 లక్షల ఖర్చు చూపించారు.

● రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరులో డీజిల్‌ కోసం రూ.10,45,777 ఖర్చు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి లెక్కలు చూపించారు.

సాక్షి, రాజమహేంద్రవరం: డీజిల్‌ పేరిట కొంత మంది పంచాయతీ కార్యదర్శులు ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో కొల్లగొట్టేశారు. చెత్త తరలించే వాహనాలే లేనిచోట్ల కూడా లక్షలాది రూపాయల లెక్కలు చూపించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని 86 పంచాయతీల్లో ఇష్టారీతిన బిల్లులు పెట్టేసి, రూ.2.50 కోట్లకు పైగా డ్రా చేశారంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 342 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పాలకవర్గాల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియడంతో బిల్లుల డ్రాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను జూన్‌ మొదటి వారంలో సడలించడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు డీజిల్‌ పేరిట బిల్లులు డ్రా చేసేశారు. విషయాన్ని గుర్తించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ జిల్లాలోని 86 మంది కార్యదర్శులకు నోటీసులు జారీ చేయించారు.

విలీన పంచాయతీల్లో ఇష్టారాజ్యం

ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో విలీనం చేసిన పంచాయతీల్లో డీజిల్‌ ఖర్చు కింద భారీగా డ్రా చేసినట్లు స్పష్టమవుతోంది. విలీనం విషయమై తలెత్తిన వివాదాల నేపథ్యంలో కొన్నేళ్లుగా ఇక్కడ పాలకవర్గాలు లేవు. ఇదే అదునుగా ఇక్కడి అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ప్రస్తుత డీజిల్‌ బాగోతం నిలుస్తోంది. డీజిల్‌ పేరిట భారీ మొత్తంలో నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో వెలుగుబంద, దివాన్‌ చెరువు, నామవరం, కాతేరు, ధవళేశ్వరం వంటివి ఉన్నాయి. మరోవైపు చిన్నచిన్న పంచాయతీల్లో సైతం రూ.5 లక్షలకు పైగా డీజిల్‌ వాడినట్లు లెక్కలు చూపించడం గమనార్హం. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే చెత్త తరలించేందుకు వాహనాలు లేనిచోట్ల కూడా డీజిల్‌ పేరిట బిల్లులు డ్రా చేసేశారు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి వద్ద ప్రస్తావించగా.. ఇతర ఖర్చులను కూడా డీజిల్‌ ఖర్చు కింద పంచాయతీ కార్యదర్శులు చూపించారని చెప్పారు. అందరికీ నోటీసులు జారీ చేశామని, వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

కొన్ని పంచాయతీల్లో డీజిల్‌ ఖర్చు (రూ.లలో) ఇలా..

మండలం పంచాయతీ ఖర్చు

రాజానగరం వెలుగుబంద 16,57,984

రాజానగరం దివాన్‌ చెరువు 14,54,928

రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు 10,45,777

కడియం కడియపులంక 9,22,890

రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరం 8,50,770

కొవ్వూరు ఇసుకపట్ల పంగిడి 8,27,668

రాజానగరం చక్రద్వారబంధం 7,34,666

రాజానగరం నామవరం 7,06,841

కొవ్వూరు దొమ్మేరు 6,49,473

నిడదవోలు సమిశ్రగూడెం 6,36,283

కొవ్వూరు పశివేదల 6,27,000

తాళ్లపూడి తాళ్లపూడి 5,33,625

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement