ఆలమూరు: సన్న బియ్యం కొనలేరు.. రేషన్ (దొడ్డు) బియ్యం తినలేరు.. బియ్యం ధర వింటేనే ముద్ద గొంతు దిగని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ, అలసత్వ విధానాల వల్ల ధాన్యాగారంగా పేరొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. బియ్యం ధరల ప్రభావంతో సగటుజీవి నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. మూడు నెలల వ్యవధిలో క్వింటా సన్న బియ్యం కిలోకు రూ.40 వరకూ పెరిగింది. దీంతో నాణ్యమైన పాత సోనామసూరి బియ్యం 26 కేజీల బస్తా బహిరంగ మార్కెట్‌లో రూ.1700 వరకూ చేరుకుంది. కార్పొరేట్ బ్రాండ్లు అయితే రూ.1900 లోపు లభించడం లేదు. రేషన్ బియ్యానికి నాణ్యత లేకపోవడంతో సగటు జీవి తినడానికి విముఖత చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు బియ్యం సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి క్వింటా రూ.పది వేలకు చేరుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక రైస్ మిల్లుల వద్ద సన్న రకాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఇదే క్రమంలో రైతులు పండించే సన్న రకాల ధాన్యం బస్తా ధర మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు.
కార్పొరేట్ల గుత్తాధిపత్యం
సన్నబియ్యం వ్యాపారం ఏకఛత్రాధిపత్యంగా తయారైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాపారులే గుత్తాధిపత్యం సాధించి బియ్యం ధరలను నియంత్రిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 350 వరకూ రైసుమిల్లులు ఉండగా వారి ఆధీనంలో 80 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది టన్నుల ఽసన్నరకాల ధాన్యాన్ని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇక్కడి గోదాముల్లో కొన్ని నెలల పాటు నిల్వ చేస్తారు. అనంతరం మిల్లింగ్ చేసి, విక్రయించి లాభాలు ఆర్జించడం ఆనవాయితీగా మారింది. కాగా ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సన్న బియ్యానికి కొరత ఏర్పడనున్న నేపథ్యంలో కార్పొరేట్ మిల్లర్లు సైతం ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు. చిన్న మిల్లుల వద్ద ఇప్పటికే నిల్వలు నిండుకున్నాయి. దీంతో బియ్యం వ్యాపారం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లి రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
ఈ ఏడాది 26 కేజీల బియ్యం బస్తా
ధరల వ్యత్యాసం (రూపాయల్లో)
బియ్యం రకం ఏప్రిల్‌లో ఆగస్టులో
సోనామసూరి 1400 1750
స్టీమ్డ్ రైస్ 1150 1500
ఆర్‌ఎన్‌ఆర్ 1200 1550
హెచ్‌ఎంటీ 1250 1600
బీపీటీ (కొత్తరకం) 1100 1500
బీపీటీ పాతరకం 1200 1650
దంపుడు బియ్యం 1250 1600
కృత్రిమ కొరత సృష్టిస్తున్న మిల్లర్లు
కిలో సన్నబియ్యం ధర రూ.72 పైమాటే
మూడు నెలల్లో
రూ.400 వరకూ పెరుగుదల
బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
జగన్ ప్రభుత్వంలో కిలో రూ.39కే ఇచ్చారని గుర్తు చేసుకుంటున్న ప్రజలు
అందుబాటులో లేని కౌంటర్లు
సన్న బియ్యం ధరల పెంపుపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు పౌరసరఫరాల శాఖ హడావుడిగా కౌంటర్లను ఏర్పాటు చేసి అంతంత మాత్రం నాణ్యత ఉన్న ఆవిరి చేసిన సన్న బియ్యాన్ని విక్రయిస్తోంది. ఒకొక్క రేషన్ కార్డుకు పది కిలోల వరకు బియ్యం ఇస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో బియ్యం ధరలు కొద్దిగా పెరిగితేనే అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేవలం కేజీ రూ.39కే విక్రయించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్న బియ్యం కేజీ ఽరూ.52 వరకూ ఉండటం వల్ల ఆ ధర ఎక్కువనే భావనతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు.


