30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి 30 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్‌) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (1938) జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. స్థానిక కంటిపూడి రామారావు హైస్కూల్‌లో గురువారం జరిగిన ఫెడరేషన్‌ కార్యకర్తల సమావేశంలో అసోసియేట్‌ అధ్యక్షుడు వైవీ రామారావు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కార్యదర్శి నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ఉదయబ్రహ్మం మాట్లాడుతూ, సంఘాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోగలమని అన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు వి.అప్పయ్యశాస్త్రి మాట్లాడుతూ, వెంటనే పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌, ముంగండి పద్మజ, నగర శాఖ గౌరవాధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.తాతారావు, ఎన్‌.గౌరీశంకర్‌, అదనపు కార్యదర్శి జీఎస్‌ఎస్‌ శ్రీనివాసులు, కార్యదర్శి అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

15లోగా ఎల్‌పీజీ

ఈ–కేవైసీ పూర్తి చేయాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని వంటగ్యాస్‌ వినియోగదారులు పెండింగ్‌ ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌ఓ) వి.పార్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌పీజీ వినియోగదారులందరికీ ఈ–కేవైసీ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ–కేవైసీ కోసం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయాలు, ప్రత్యేక నమోదు శిబిరాలు, ఇంటింటి సందర్శనల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తంగా ఉండాలి

రాజమహేంద్రవరం రూరల్‌: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికన్‌గున్యా, వైరల్‌ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్‌, లెప్టోస్పిరోసిస్‌ వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి.కోమల గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉన్నాయని వివరించారు. డెంగీ వ్యాధిని ముందుగానే గుర్తించాలని, అధిక జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా రక్తస్రావ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల పర్యవేక్షణలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తమకు సహకరించాలని, వివిధ జ్వరాలతో ఎవరైనా వస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలని డాక్టర్‌ కోమల కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement